రిటైర్ అయ్యాక కూడా మూల్యం చెల్లిస్తావ్‌.. నిమ్మగడ్డకు వైసీపీ వార్నింగ్‌..?

Chakravarthi Kalyan
రాష్ట్రఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌, వైసీపీ గొడవ మరింత ముదురుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే వైసీపీ నేతలు మరో అడుగు ముందుకేస్తున్నారు. ఏకంగా నిమ్మగడ్డకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తప్పుమీద తప్పు చేస్తున్నారని... చేసిన పాపం ఊరికే పోదని.. పదవీ విరమణ తర్వాత కూడా మూల్యం చెల్లించక తప్పదని వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి.
ఎస్‌ఈసీ తాను చేసిన తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఆయనకు రెండు మూడు వారాల్లోనే వస్తుందని అంబటి రాంబాబు అంటున్నారు. రాజ్యాంగ వ్యవస్థ అయిన ఎస్‌ఈసీ పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఒక అభ్యర్థి భర్త చనిపోతే నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ వెళ్లి పరామర్శించడమేంటి? ఆయన విధినా అది? టీడీపీ ప్రతినిధిగా అక్కడికి వెళ్లారా? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.
తూర్పుగోదావరి జిల్లాలో గొల్లలగుంట సర్పంచ్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన వారి భర్త అనుమానస్పద స్థితిలో చనిపోయారు. ఆ ఘటనపై విచారణ జరుగుతుంది.. వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. సాక్షాత్తు ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించడం వెనక ఉన్న ఆంతర్యమేంటీ..? ఎన్నికల కమిషన్‌ విధిని నిమ్మగడ్డ మరిచిపోయారా..? టీడీపీకి చెందిన వారు చనిపోతేనే వెళ్తారా..? లేక ఏ పార్టీకి సంబంధించిన వారు చనిపోయినా వెళ్లి పలకరిస్తారా..? నిమ్మగడ్డ సమాధానం చెప్పాలి అని అంబటి రాంబాబు నిలదీశారు.
ఎస్‌ఈసీ గొల్లలగుంటకు చంద్రబాబు తరఫున వెళ్లారా..? లోకేష్‌కు పైలెట్‌గా వెళ్లారా..? సమాధానం చెప్పాలి. ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించకుండా.. ఎన్నికల కమిషన్‌ ఒక తెలుగుదేశం పార్టీలా అవతరించి వెళ్లి పరామర్శించే కార్యక్రమాలు జరుగుతుంటే.. దీని వెనకున్న కుట్ర ఏంటో అర్థం కావడం లేదు. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి అన్నారు అంబటి రాంబాబు. చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు, నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎన్నికుట్రలు చేసినా అంతిమ విజయం ప్రజలదే అంటున్నారు అంబటి రాంబాబు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: