చైనా సంచలన నిర్ణయం.. ఇది అమెరికా, ఇండియాలకు పెద్ద దెబ్బే..!

Chakravarthi Kalyan
చైనా.. ఇది భారత్‌కు పక్కలో బల్లెం. అసలే ఇది మన దేశంపై యుద్ధానికి సిద్ధమవుతున్న వార్తలు వస్తున్నాయి. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటుందని అనుమానం వ్యక్తమవుతోంది. ఇటీవలే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తన సైనిక బలగాలకు ఇచ్చిన ఓ సందేశం ద్వారా ఇది వెల్లడైంది. పోరాట నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకొని, అత్యున్నతస్థాయి అప్రమత్తతను కలిగి ఉండాలని.. ఏ క్షణాన యుద్ధం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిన్ పింగ్‌ ఆ సందేశంలో చెప్పారు.
ఇక తాజాగా చైనా తీసుకున్న ఓ సంచలన నిర్ణయం.. కలవరం సృష్టిస్తోంది. అదేంటంటే.. చైనాతో సమగ్ర పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు యూరోపియన్ యూనియన్.. ఈయూ ప్రకటించింది. ఇది ఆర్థికంగా చైనాకు కీలక మలుపు. దీనికి ఊతమిస్తూ ఇటీవల చైనా సైనికంగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రోజు దేశాధ్యక్షుడు, కమ్యూనిస్ట్‌ పార్టీ అధినేత షీ జిన్‌పింగ్‌కు అపార సైన్యాధికారాలను కట్టబెడుతూ తన జాతీయ రక్షణ చట్టాన్ని సవరించింది.
అంటే.. విదేశాల్లో తమ పెట్టుబడులు, ప్రాజెక్టులు, కంపెనీలు, పౌరులను రక్షించుకోవడం కోసం సైనిక చర్యకు దిగడానికి సిద్ధమని తాజా సవరణ ద్వారా చైనా చెబుతోంది. దీనికి కావలసిన సైనిక, పౌర వనరులను సమీకరించే అధికారాన్ని జిన్‌పింగ్‌కు ధారాదత్తం చేసింది. ఈ రెండు పరిణామాలు అమెరికా, ఇండియాలకు కీలకం.. దీని ద్వారా అమెరికాను అన్ని విధాలుగా అధిగమించి తానే అగ్రరాజ్యంగా ఎదగాలన్నది చైనా చిరకాల స్వప్నం నెరవేరే అవకాశం కనిపిస్తోంది.
ఇటీవల అగ్రరాజ్యం అమెరికా పరిస్థితులు కూడా చైనాకు కలసి వస్తున్నాయి. 2008 ఆర్థిక సంక్షోభం, 2016లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నిక, 2020లో కరోనా వైరస్‌ విజృంభణ.. ఇవన్నీ  చైనా అగ్రరాజ్యంగా ఎదగడానికి తోడ్పడుతున్నాయి. చైనా దూకూడు చూస్తే ఈ దశాబ్దం ముగిసే లోపలే జీడీపీలో అమెరికాను మించే అవకాశం ఉంది. అదే జరిగితే.. చైనా నుంచి అమెరికా, ఇండియాలకు కష్టాలు తప్పకపోవచ్చు.  లద్దాఖ్‌లో భారత్‌, చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొని ఉన్న తరుణంలో ఈ పరిణామాలు మనకు చిరాకు కలిగిస్తున్నాయని చెప్పక తప్పదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: