సచివాలయ ఉద్యోగులు జీన్స్, టీషర్ట్ వేసుకో కూడదా..?

Deekshitha Reddy
ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాలపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టిపెట్టింది. సచివాలయ ఉద్యోగులు గ్రామాల్లో, పట్టణాల్లో విధులకు హాజరయ్యే సమయంలో జీన్స్, టీ షర్ట్ వేసుకోకూడదని అనధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల పలు సచివాలయాలకు తనిఖీలకోసం వెళ్తున్న అధికారులు ఇదే విషయాన్ని ఉద్యోగులకు స్పష్టం చేస్తున్నారు. విధులకు హాజరయ్యే సమయంలో డ్రెస్ కోడ్ తప్పనిసరి అని, ఫార్మల్ వేర్ లోనే సచివాలయాలకు రావాలని సూచిస్తున్నారు.
ఇటీవల సచివాలయ ఉద్యోగుల డ్రెస్సింగ్ పై కొన్నిచోట్ల గ్రామస్తులనుంచి అధికారులకు ఫిర్యాదులందాయి. ఊరిలోనే సచివాలయం ఉండటంతో.. వాలంటీర్లు కూడా ఇంటివద్ద ఎలా ఉంటారో, అలాగే సచివాలయాలకు వచ్చేస్తున్నారు. దీంతో గ్రామస్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దీంతో ఉన్నతాధికారులు డ్రెస్ కోడ్ విషయంపై నిర్ణయం తీసుకున్నారు. అయితే నేరుగా దీనిపై ఉత్తర్వులు ఇవ్వకుండా.. ఎక్కడికక్కడ జిల్లా స్థాయి అధికారులు ఎంపీడీవోలు, ఎమ్మార్వోలకు మౌఖిక ఆదేశాలిచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సచివాలయాలు సందర్శిస్తున్న మండల స్థాయి అధికారులు.. సచివాలయ సిబ్బందికి సూచనలు చేశారు. ఇకపై వాలంటీర్లు కానీ, ఉద్యోగులు కానీ.. జీన్స్, టీ షర్ట్ లతో సచివాలయాలకు రాకూడదని ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇకపై సచివాలయాలను తరచూ ఉన్నతాధికారులు సందర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏకంగా సీఎం జగన్ ఈ విషయంపై అధికారులకు పలు సూచనలు చేశారు.
సీఎం జగన్ ఏమన్నారంటే..
"ఒక ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలను కలెక్టర్లు, జేసీలు తరచూ తనిఖీ చేయాలి. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చూపొద్దు. కలెక్టర్లు వెళితే జేసీలు కూడా వెళ్తారు. వారు వెళితే ఇతర అధికారులు కూడా తనిఖీలు చేస్తారు. ప్రాజెక్టు ఆఫీసర్, సబ్‌ కలెక్టర్, మున్సిపల్‌ కమిషనర్, జిల్లాలో ప్రతి ఐఏఎస్‌ అధికారి తప్పనిసరిగా సచివాలయాలను తనిఖీ చేయాలి. గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలి. ఎక్కడా అవినీతికి తావు లేకుండా ప్రతిదీ పారదర్శకంగా ఉండాలి. అదే నా సంకల్పం. అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం కాబట్టి ప్రతి అధికారి తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించాలి."

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: