తినే విషయంలో కఠిన నిర్ణయాలా..?

NAGARJUNA NAKKA
కరోనా సృష్టించిన విలయానికి చైనా తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందా..? రాబోయే రోజుల్లో ఆహార సంక్షోభం చైనాను చుట్టుముడుతోందా..? అధ్యక్షుడు జిన్‌పింగ్‌ క్లీన్‌ ప్లేట్‌ ప్రపోజల్‌ అందులో భాగమేనా..? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం చెప్తోంది అంతర్జాతీయ సమాజం.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ గతవారం క్లీన్‌ ప్లేట్‌ నినాదంతో ముందుకొచ్చారు. ఆహార వృథాను అరికట్టడం ఈ స్లోగన్‌ ప్రధాన ఉద్దేశం. ఆహార వృథా చేయొద్దని నినాదాలు ఇవ్వడం చైనాకు కొత్త కాదు. 2013లో తొలిసారి ఆపరేషన్ ఎంప్టీ ప్లేట్‌ ప్రవేశపెట్టారు. అయితే ఇది ఆ దేశంలో ధనవంతులకు మాత్రమే. కానీ ఇప్పుడు జిన్‌పింగ్‌ ఇచ్చిన క్లీన్‌ ప్లేట్ నినాదం ప్రజలకు కూడా వర్తిస్తుంది. దీని ప్రకారం ఆహారాన్ని అస్సలు వృథా చేయరాదు. ఖాళీగా ఉన్నాం కదా అని తినడానికి వీల్లేదు. రెస్టారెంట్‌కు వెళ్తే ఒకరిని తగ్గించి ఫుడ్‌ ఆర్డర్ చేయాలి.
చైనా ఇంతటి కఠిన నిర్ణయానికి కారణమేంటనేది ఆసక్తి కలిగిస్తోంది. చైనా ఏం చేసినా దాని వెనుక ఏదో వ్యూహం ఉంటుంది. ఇప్పుడు జిన్‌పింగ్‌ ఇచ్చిన క్లీన్ ప్లేట్‌ నినాదం వెనుక దీర్ఘకాల వ్యూహం ఉందనేది నిపుణుల అంచనా..! చైనాలో ఈసారి తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని సమాచారం. గతేడాదితో పోల్చితే ఈసారి 20శాతం గోధుమల దిగుబడి తగ్గింది. దేశంలో ఈ ఏడాది భారీ వరదలు ముంచెత్తాయి. అమెరికా వాణిజ్య యుద్ధం చైనా సంక్షోభానికి మరో కారణం. భారత్, వియత్నాం కూడా వరి ఎగుమతిపై ఆంక్షలు విధించాయి.
చైనాలో ఆహార ధాన్యాల ధరలు పెరిగిపోతున్నాయి. సరఫరా లేకపోవడం వల్లే ధరలు పెరుగుతున్నాయని నిపుణుల అంచనా. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది తొలి అర్ధభాగంలోనే గోధుమలను దిగుమతి చేసుకుంది చైనా! రిజర్వ్‌లో ఉంచుకున్న మొక్కజొన్నలను చైనా విక్రయించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు .. విదేశాల నుంచి మంసాహారాన్ని కూడా పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంది.
రాబోయే ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో భాగంగానే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ క్లీన్‌ ప్లేట్ ఉద్యమాన్ని ప్రారంభించారని అర్థమవుతోంది. ఇప్పటి నుంచే ఆహార వృథాను అరికట్టడంలో ప్రజలను భాగస్వాములను చేయడం ద్వారా కొంతమేర ఆదా చేయవచ్చేనేది చైనా ప్లాన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: