కృష్ణాలో కమ్మ మహిళల పోరు....ఈ సారి జెడ్పీ పీఠం దక్కేదెవరికో?

M N Amaleswara rao

ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కృష్ణా జెడ్పీ పీఠాన్ని దక్కించుకోబోయేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది. జెడ్పీ పీఠం ఛైర్మన్ రిజర్వేషన్ జనరల్ మహిళకు కేటాయించడంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల నుంచి కొందరు మహిళా అభ్యర్ధులు రేసులోకి వచ్చారు. ముఖ్యంగా కమ్మ సామాజికవర్గానికి చెందిన మహిళా నేతలు జెడ్పీ పీఠం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గత ఎన్నికల్లో జెడ్పీ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది.

 

అప్పుడు జెడ్పీ చైర్‌పర్సన్‌గా గద్దె అనురాధ ఎన్నికయ్యారు. ఆమె గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు జెడ్పీటీసీగా గెలిచి, చైర్‌పర్సన్‌గా పని చేశారు. ఇక ఈ ఎన్నికల్లో ఆమె పోటీ చేయడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే జెడ్పీటీసీగా పోటీ చేయాల్సిన అభ్యర్ధి ఏదొక జెడ్పీ ప్రాదేశిక నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండాలి. కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె తన ఓటుని విజయవాడ తూర్పు స్థానంలోకి మార్పించుకున్నారు. దీంతో ఆమెకు పోటీ చేసే అవకాశం లేదు.

 

అయితే కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న సుంకర పద్మశ్రీ టీడీపీలోకి రావోచ్చని ప్రచారం జరుగుతుంది. గన్నవరం నియోజకవర్గానికి చెందిన ఆమె, గత కొన్ని రోజులుగా అమరావతి ఉద్యమంలో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. ఇక కమ్మ సామాజికవర్గానికి చెందిన ఈమెని టీడీపీలోకి తీసుకొచ్చే అవకాశముందని అంటున్నారు. కాకపోతే నామినేషన్‌కు ఒకరోజే గడువు ఉండటంతో, ఆమె టీడీపీలోకి వచ్చి నామినేషన్ వేసి పోటీకి దిగుతారో లేదో అనేది చూడాలి. ఒకవేళ ఆమె టీడీపీ తరుపున బరిలో దిగితే, జెడ్పీ చైర్‌పర్సన్ రేసులో ఉంటారు.

 

ఇక అటు వైసీపీ నుంచి అదే కమ్మ సామాజికవర్గానికి చెందిన తాతినేని పద్మావతి రేసులో ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా ఈమె జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్ధిగా ఉన్నారు. కానీ అప్పుడు టీడీపీ జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండటంతో గెలిచే అవకాశాలున్నాయని ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం ఈమె వుయ్యూరు జెడ్పీటీసీగా పోటీ చేస్తున్నారు. మరి చూడాలి ఈ కమ్మ మహిళా నేతల్లో విజయం ఎవరిని వరిస్తుందో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: