ఇకపై ఆ స్టేడియం పేరు.. అరుణ్ జైట్లీ స్టేడియం

NAGARJUNA NAKKA

ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్లా మైదానం పేరు మారిపోయింది. ఇక పై అది.. అరుణ్ జైట్లీ స్టేడియం.. ఢిల్లీ క్రికెట్‌కు కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన పేరును పెట్టాను. దేశ రాజధానిలో జరిగిన ఓ కార్యక్రమంలో క్రికెటర్లు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 


కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ స్మారకార్థం ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్లా మైదానానికి 'అరుణ్‌ జైట్లీ స్టేడియం'అని పేరు పెట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ స్టేడియానికి కొత్తగా నామకరణం చేశారు. జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో జరిగిన నూతన నామకరణ కార్యక్రమంలో జైట్లీ కుటుంబసభ్యులతో పాటు.. క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. 


ఢిల్లీ డిస్ట్రిక్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు అరుణ్‌ జైట్లీ సుదీర్ఘ కాలం అధ్యక్షుడిగా సేవలందించారు. డీడీసీఏతో పాటు బీసీసీఐలో పలు బాధ్యతలు, హోదాలను నిర్వహించారు. అయన అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే ఢిల్లీ క్రికెట్‌లో అనేక మార్పులు వచ్చాయి. దీంతో జైట్లీ మరణాంతరం ఆయన గుర్తుగా ఫిరోజ్‌ షా కోట్లా మైదానానికి జైట్లీ పేరు పెట్టాలని డీడీసీఏ నిర్ణయించింది.  మరోవైపు కోట్లా స్డేడియంలోని కొత్త పెవిలియన్ స్టాండ్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు పెట్టారు. ఈ సందర్భంగా క్రికెటర్లు అరుణ్ జైట్లీకి నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మొత్తానికి దివంగత, మాజీ కేంద్రమంత్రికి అరుదైన గౌరవం దక్కింది. చరిత్రలో నిలిచిపోయేలా స్టేడియానికి అరుణ్ జైట్లీ పేరు పెట్టడంపై.. ఆయన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ స్టేడియంలో మన దేశానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చేలా ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు తయారు కావాలని మనమూ ఆశిద్దాం..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: