ఏపీ అసెంబ్లీలో శ్రీనివాస‌మ‌యం... ఎంత‌మంది శ్రీనివాసులంటే...

VUYYURU SUBHASH
ఏపీ అసెంబ్లీ అంతా శ్రీనివాస‌మ‌యంగా మారిపోయింది. తాజా అసెంబ్లీలో శ్రీనివాస్ పేరు నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉండ‌డంతో ఆ పేరుతో ఒక‌రిని పిలిస్తే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ప‌లికే ఛాన్స్ నెల‌కొంది.  దీంతో అసెంబ్లీలో ప్ర‌స్తుతం చిత్ర‌విచిత్ర‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. స్పీక‌ర్ లేదా ఇత‌ర మంత్రులు అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్న‌ప్పుడు శ్రీనివాస్ అని పిలిస్తే ఏకంగా ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు 13 మంది ఎమ్మెల్యేలు ప‌లికే ఛాన్స్ ఉంది.
ఎందుకంటే ఏపీ రెండో అసెంబ్లీలో శ్రీనివాస్ అనే పేరుతో ఉన్న ఎమ్మెల్యేలు 13 మంది వ‌ర‌కు గెలిచారు. 


గతంలో అసెంబ్లీలో ఇంత పెద్ద మొత్తంలో శ్రీనివాసులు ఉన్నది లేదు. స‌భ‌లో ఎవ‌రైనా ఈ పేరును గ‌ట్టిగా ప‌లికితే ఓ ఐదారుగురు ఎమ్మెల్యేలు ప‌ల‌కే ఛాన్స్ ఉంది. పూర్తిగా ఇంటి పేరుతో పాటు పిలిస్తేనే ఎవరిని పిలిచారో అర్ధం అవుతుంది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలుండే ఏపీ అసెంబ్లీలో ఈసారి ఏకంగా 13 శ్రీనివాసరావులు ఎన్నికయ్యారు.


ఇక ఈ పేరుతో ఎన్నికైన ఎమ్మెల్యేల వివ‌రాలు చూస్తే విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్‌కోట నుంచి క‌డుబండి శ్రీనివాస‌రావు వైసీపీ త‌ర‌పున తొలిసారి గెలిచారు. ఇక విశాఖ జిల్లా భీమిలి నుంచి అవంతి శ్రీనివాస్ వైసీపీ త‌ర‌పున గెల‌వ‌గా... అసెంబ్లీకి ఆయ‌న గెల‌వ‌డం ఇది రెండోసారి. ఇక మంత్రి గంటా శ్రీనివాస‌రావు మ‌రోసారి విశాఖ నార్త్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. తూర్పుగోదావ‌రి జిల్లా రామ‌చంద్రాపురం నుంచి చెల్లుబోయిన శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్యేగా గెల‌వ‌గా... ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా నిడ‌ద‌వోలు నుంచి జి.శ్రీనివాసుల నాయుడు తొలిసారి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు.


ఇక అదే జిల్లాలోని భీమ‌వ‌రం నుంచి గ్రంథి శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇది ఆయ‌న అసెంబ్లీకి ఎన్నిక‌వ్వ‌డం రెండోసారి కాగా.. ఆయ‌న ఏకంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌పై విజ‌యం సాధించారు. అదే జిల్లాలోని ఉంగుటూరు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పుప్పాల శ్రీనివాస‌రావుతో పాటు ఏలూరు నుంచి గెలిచిన ఆళ్ల కాళికృష్ణ శ్రీనివాస్ (నాని) మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఇక విజ‌య‌వాడ వెస్ట్ నుంచి వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు వైసీపీ నుంచి గెలిచారు. ఆయ‌న గ‌తంలో ప్ర‌జారాజ్యం నుంచి కూడా ఓ సారి గెలిచారు. ఇక న‌ర‌సారావుపేట నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ‌రుసగా రెండోసారి వైసీపీ నుంచి గెలిచారు. ఒంగోలు నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఐదోసారి అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. ఇక క‌డ‌ప జిల్లా రైల్వేకోడూరు నుంచి కొరుముట్ల శ్రీనివాసులు వ‌రుస‌గా నాలుగోసారి గెల‌వ‌డం విశేషం. ఇక చిత్తూరు నుంచి అర‌ణి శ్రీనివాసులు తొలిసారిగా వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: