ఆ కీలక లీడర్‌ జనసేనలోకి జంపేనా..?

VUYYURU SUBHASH
ఏపీలో వచ్చే ఎన్నికల వేల కప్పుల తక్కెడలు జోరందుకున్నాయి. ఎన్నికల టైమ్‌ దగ్గర పడుతుండడంతో నిన్నటి వరకు ఒక పార్టీలో ఉన్న వారు రేపు మరో పార్టీలోకి జంప్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. తాము ఏ పార్టీలో ఉన్నామన్నది ముఖ్యం కాదు తమకు ఏ పార్టీ సీటు ఇస్తే ఆ పార్టీలోకి జంప్‌ చేసేందుకు నేతలు రెడీ అయిపోతున్నారు. ఇందుకు కొందరు నేతలు తమకు సీటే లక్ష్యం అని చెబుతుండగా మరి కొందరు మాత్రం పార్టీ మారేందుకు సాకులు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే ఏపీకి చెందిన మాజీ మంత్రి ఒకరు ఇప్పుడు జనసేనలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి వట్టి వసంత కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. వట్టి కుటుంబానికి కాంగ్రెస్‌కు దశాబ్దాల అనుబంధం ఉంది. 


దివంగత మాజీ ముఖ్య మంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వసంత కుమార్‌ 2004లో వైఎస్‌ అండదండలతోనే ఉంగుటూరు నుంచి పోటీ చేసి తొలి సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో ఆయన అదే నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి గెలిచారు. ఆ తర్వాత వసంత్‌ వైఎస్‌, రోశ‌య్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి కేబినేట్‌లో మంత్రిగా కూడా పని చేశారు. రాష్ట్ర విభజనకు ముందు వసంత్‌ కాంగ్రెస్‌ నుంచి నరసాపురం ఎంపీగా పోటీ చెయ్యాలని అనుకున్నారు. అయితే గత ఎన్నికలకు ముందు ఏపీలో కాంగ్రెస్‌ నిర్వీర్యం అవ్వడంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన కొద్ది రోజులుగా పొలిటికల్‌గా రీ యాక్టీవ్‌ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. 


ఈ క్రమంలోనే ఐదారు నెలల క్రితం తన అనుచరులతో మీట్‌ అయిన వసంత్‌ తాను వచ్చే ఎన్నికల్లో ఉంగుటూరు నుంచి అసెంబ్లీ బరిలో దిగుతున్నానని తన పాత కేడర్‌, అనుచరులంతా ఎట్టి పరిస్థితిలోనూ తనకు వచ్చే ఎన్నికల్లో సపోర్ట్‌ చెయ్యాలని ఆ సమావేశంలో చెప్పారు. తాజాగా వసంత్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామ పత్రాన్ని ఏఐసీసీకి పంపిన వసంత్‌ తాను తీవ్ర ఆవేదనతోనే  పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ పట్ల నాలుగు దశాబ్దాలుగా తన కుటుంబం ఆ తర్వాత తాను ఎంతో నిబద్దత కలిగిన వ్యక్తులుగా పని చేసామని అయితే కాంగ్రెస్‌ తాజాగా టీడీపీతో జట్టు కట్టేందుకు సిద్ధం అవుతుండడంతో తాను జీర్ణించుకోలేక పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. 


ఇదిలా ఉంటే వసంత్‌ వచ్చే ఎన్నికల నేపథ్యంలో జనసేనలోకి జంప్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. మెగా ఫ్యామిలీతో ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వసంత్‌కు అటు వైసీపీలో కీలకంగా ఉన్న కొందరు నేతలతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే నియోజకవర్గంలో ఉన్న పరిణామాల నేపథ్యంలో ఆయన వైసీపీ కంటే జనసేనలోకి చేరేందుకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఉంగుటూరు నుంచి వసంత్‌ జనసేన అభ్యర్థిగా పోటీలో ఉంటే టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య‌ ట్రైయాంగిల్‌ ఫైట్‌ తప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: