కాంగ్రెస్, టిడిపి పొత్తు- కాంగ్రెస్ కు షాక్..వట్టి రాజీనామా

Vijaya

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పొత్తు పోడిచిందో లేదో వెంటనే కాంగ్రెస్ లో ఓ పెద్ద వికెట్ డౌన్ అయిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లాలో కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉంటున్న మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ పార్టీకి రాజీనామా చేశారు. జిల్లాలోని ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి వట్టి చాలాసార్లు గెలిచారు.  2014 లో రాష్ట్ర విభజన తర్వాత కూడా వట్టి పార్టీని వదిలిపెట్టి పోలేదు. అటువంటిది కాంగ్రెస్, టిడిపిల పొత్తును మాత్రం జీర్ణించుకోలేకపోయారు. దాంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

 

వట్టి కుటుంబం దాదాపు 45 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. కాపు సామాజికవర్గానికి చెందిన వట్టి దశాబ్దాల రాజకీయంలో ఇంకో పార్టీ వైపు చూడలేదు. 2009లో చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ పెట్టినపుడు కూడా ఎంత ఒత్తిడి వచ్చినా కాంగ్రెస్ పార్టీని మాత్రం వదల్లేదు. చివరకు ఏకపక్షంగా అధిష్టానం చేసిన రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్ నేలమట్టమైనా పార్టీని వదిలిపోలేదు. అటువంటిది చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవటాన్ని మాత్రం వట్టి జీర్ణించుకోలేకపోయారు.

 

జనసేన పార్టీ యాక్టివ్ అయిన దగ్గర నుండి వట్టిని పార్టీలోకి చేర్చుకోవటానికి ఎంతో ప్రయత్నించారు. అయినా జనసేన వైపు చూడలేదు. అదే సమయంలో వైసిపి నేతలు కూడా వట్టి కోసం ప్రయత్నించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తాను మాత్రం కాంగ్రెస్ లోనే ఉంటానని స్పష్టం చేశారు. అటువంటిది షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కాంగ్రెస్, టిడిపిలు పొత్తులు పెట్టుకోవటం, వట్టి రాజీనామా చేయటంతో జిల్లా రాజకీయ సమీకరణల్లో అనూహ్య మార్పులు జరిగే అవకాశాలున్నాయి. బహుశా వైసిపిలోకో లేకపోతే జనసేనలోకో వట్టి చేరే అవకాశాలున్నాయని సమాచారం. చంద్రబాబుతో పొత్తు ఇష్టంలేని పలువురు నేతలు త్వరలో వట్టి బాటనే పట్టే అవకాశాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: