విజయవాడలో ‘విగ్రహ’ రాజకీయం..!

Vasishta

విగ్రహ రాజకీయాలు విజయవాడను వేడెక్కిస్తున్నాయి. అభివృద్ధి పనులకు ఆటంకంగా ఉందని.. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, జై ఆంధ్ర ఉద్యమకారుడు కాకాని వెంకటరత్నం విగ్రహం తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది.విజయవాడలో ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి బెంజ్ సర్కిల్ వద్ద ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. ప్రభుత్వ సూచనతో హైవే అథారిటీ ఫ్లై ఓవర్ పనులను వేగంగా పూర్తి చేస్తోంది. ఫ్లైఓవర్ కు పిల్లర్లు నిర్మాణం పూర్తైనా బెంజి సర్కిల్ వద్ద మాత్రం ఇంకా చేపట్టలేదు. ఫ్లై ఓవర్  పనులకు  బెంజ్ సర్కిల్‌ లోని కాకాని వెంకట రత్నం విగ్రహం అడ్డు వస్తుందని... దీన్ని తొలగిస్తేనే పనులు చేపడతామని హైవే అథారిటీ అధికారులు ప్రభుత్వాన్ని కోరారు.


విగ్రహం తొలగించకపోతే ఫ్లైఓవర్ పనులు జరగని పరిస్ధితి దృష్ట్యా తొలగించాలని అధికారులు నిర్ణయించారు. దీనిపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఉన్నతాధికారులు కాకాని వెంకట రత్నం కుటుంబానికి ముందుగానే విషయాన్ని వివరించారు. భారీగా బలగాలను మొహరించి ఆదివారం తెల్లవారుజామున పొక్లయిన్‌తో విగ్రహం తొలగించేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న కాకాని కుటుంబ సభ్యులు, అభిమానులు, వైకాపా నేతలు తరలివచ్చి విగ్రహం తొలగింపును అడ్డుకున్నారు. వైసీపీ నేత యలమంచిలి రవి, అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అతి కష్టంమీద ఆందోళన కారులను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించి అనంతరం విగ్రహాన్ని తొలగించారు.


పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన యలమంచిలి రవి మరోసారి బెంజ్ సర్కిల్ వద్ద ఆందోళనలకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు మరోసారి ఆయన్న అరెస్టు చేసి.. ఉంగుటూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ దగ్గర ఆయన అనుచరులు ధర్నాకు దిగడంతో అక్కడా కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం కావాలనే కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని తొలగించిందని ఆయన అభిమానులు మండిపడుతున్నారు. తిరిగి వెంటనే విగ్రహాన్ని పున:ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తున్నారు.


కాకాని వెంకటరత్నం విగ్రహం తొలగింపు అంశాన్ని వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. అభివృద్ధికి ఆటంకం కలగకూడదనే విగ్రహాన్ని తొలగించామని.. ఫ్లైఓవర్ పనులు పూర్తైన తర్వాత యథాతథంగా విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని ప్రకటించారు. అభివృద్ధి కోసం చిన్న చిన్న సవరణలు తప్పనిసరైనా.. ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్న గొప్పవాళ్ల విగ్రహాలను తొలగించడం సరికాదని.. ఒకవేళ తొలగించాల్సి వస్తే మరో చోట వెంటనే ప్రతిష్టించేలా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని విజయవాడ వాసులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: