5 మిలియన్ డాలర్లు సేకరించిన ఇండో-అమెరికన్ డాక్టర్లు..?

Suma Kallamadi
అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (AAPI) ప్రకారం.. ఇండో-అమెరికన్ డాక్టర్లు 5 మిలియన్ డాలర్లను సేకరించారు. భారతదేశంలోని 45 ఆసుపత్రులకు 2,300 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 100 వెంటిలేటర్లు, 100 హై-ఫ్లో నాసికా కాన్యులా మెషీన్‌లను అందించే లక్ష్యంతోనే విరాళాలు సేకరించారు. అమెరికాలో అత్యంత ప్రభావవంతమైన ఇండియన్ డాక్టర్స్ విరాళాలు సేకరించారని ఎఎపీఐ తెలిపింది. భారత మూలాలున్న అమెరికన్ డాక్టర్లు ఒక సంఘంగా ఏర్పడి సహాయం చేసేందుకు అందరికంటే ముందు ఉంటున్నారు. అయితే తాము సేకరించిన విరాళాలు ఇండియా కి బాగా ఉపయోగపడతాయని ఇండో అమెరికన్ వైద్యులు అభిప్రాయపడ్డారు.
అమెరికాలో 1,00,000 కంటే ఎక్కువ మంది వైద్యుల ఆసక్తికి ప్రాతినిధ్యం వహిస్తున్న అతిపెద్ద వైద్య సంస్థ ఎఎపీఐ. అయితే ఎఎపీఐ, భారతీయ కమ్యూనిటీ సభ్యుల ఔదార్యం అపూర్వమైనదని ఎఎపీఐ అధ్యక్షురాలు డా. అనుపమ గొట్టిముకుల పేర్కొన్నారు. భారతదేశంలో కరోనా విజృంభిస్తుందని వస్తున్న నివేదికల నేపథ్యంలో సాయం చేసేందుకు నడుం బిగించామని ఎఎపీఐ సంస్థ తెలిపింది. దేశంలోని మారుమూల ప్రదేశాల్లో కూడా వైద్య సామాగ్రి, వైద్య చికిత్స అందేలా భారత ప్రభుత్వంతో కలిసి చర్యలు చేపడుతున్నామని ఎఎపీఐ సంస్థ తెలిపింది.
రాబోయే కోవిడ్ థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు ఎఎపీఐ సంస్థ మిగిలిన నిధులను కూడా ఉపయోగిస్తుందని సంస్థ ఉపాధ్యక్షురాలు డా.అంజనా సమద్దర్ వెల్లడించారు. ఇక డాక్టర్లతో పాటు చాలామంది ఇండో అమెరికన్లు భారత దేశం కోసం మిలియన్ డాలర్లను సేకరించారు. తెలుగు రాష్ట్రాలకు కూడా ఇండో అమెరికన్లు కోట్ల విలువైన వైద్య సామాగ్రిని అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. చిన్న పిల్లలు సైతం మాతృభూమి కోసం తమవంతు కృషి చేసి విరాళాలు సేకరించి ఫిదా చేశారు. విద్యార్థులు కూడా భారీ ఎత్తున విరాళాలు జమ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు. వారు చేసిన సాయం కారణంగా చాలా మంది పేద ప్రజలు ప్రాణాలను నిలబెట్టుకోగలిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: