తెలుగు సంబరాలకు ముమ్మరంగా సన్నాహాలు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా జరిగే తెలుగు సంబరాలు చికాగో వేదికగా జరిపేందుకు నాట్స్ ఏర్పాట్లు చేస్తోంది. మరో రెండు రోజుల్లో ప్రారంభమయ్యే ఆ వేడుకల్లో ఈ సారి తెలుగు రాష్ట్రాల నుంచి అతిరథమహారథులు విచ్చేస్తున్నారు. ఈ సంబరాల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా మారనున్నారు. బన్నీతో పాటు డీజే టీం కూడా సంబరాల్లో సందడి చేయనుంది. అమెరికాలో తొలిసారిగా నాట్స్ మూడు రోజుల పాటు మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.తెలుగు సినీ గాయనీ గాయకులు హుషారైన పాటలతో ఈ మ్యూజిక్ నైట్ సాగనుంది.
జూన్ 30 నుంచి జులై 2 వరకు కన్నులపండువగా సంబరాలు జరగనున్నాయి. వసుదైక కుటుంబం పేరుతో నాట్స్ సంబరాల టీం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తోంది. తెలుగు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం జరగనుంది. భాషే రమ్యం.. సేవే గమ్యం అని నినదించే నాట్స్ దానికి తగ్గటుగానే ఈ సంబరాలు జరగనున్నాయి. అమెరికాలో తెలుగు వారంతా ఈ సంబరాలకు విచ్చేసి సంతోషాలను పంచుకోవాలని నాట్స్ పిలుపునిచ్చింది.