తెలుగు ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాలకుపైగా కెరీర్ కలిగిన నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన పలు చిత్రాలు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.బాలయ్యకీ, సంక్రాంతికీ అవినాభావ సంబంధం ఉంది.నందమూరి నటసింహాన్ని ఇండస్ట్రీ వర్గాలవారు సంక్రాంతి సింహం అని కూడా అంటుంటారు. ఎందుకంటే ఆయన కెరీర్లో పెద్ద పండగప్పుడు రిలీజ్ అయిన సినిమాలు మెజారిటీ శాతం సూపర్ హిట్స్ అయ్యాయి. మరికొన్ని డిజాస్టర్ గా నిలిచాయి. అలాంటివాటిలో పరమవీరచక్ర ఒకటి. 2011లో భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.ఇక అసలువిషయానికొస్తే పరమవీర చక్ర మూవీకి దర్శకత్వం దాసరి నారాయణరావు నిర్వహించారు మరియు తేజ సినిమా బ్యానర్‌పై సి. కళ్యాణ్ నిర్మించారు, ఈ చిత్రంలో బాలకృష్ణ, అమీషా పటేల్, షీలా, నేహా ధూపియా, నాగినీడు మరియు మురళీ మోహన్ తదితరులు నటించారు. పరమవీర చక్ర చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. దర్శకుడిగా దాసరి నారాయణరావుకు ఇది 150 వ చిత్రం.ఇదిలావుండగా దాసరి కూడా తన 150 చిత్రం కదా అని చాలా జాగ్రత్తలు తీసుకుంటాడని ఎవరకి వారే సర్దిచెప్పుకుని రిలీజ్ కోసం ఎదురుచూసారు.
అయితే వారి ఆశలు నిరాశలే అయ్యాయి. అభిమానులు సైతం ఫరవాలేదు అనలేని స్ధితిలో చిత్రం తెరకెక్కింది. సైనికాధికారిగా, సినీ హీరోగా, రావణాబ్రహ్మగా, కొమురం భీమ్ గా రకరకాల గెటప్స్ లో బాలకృష్ణ కనపించి అలరించినా, అదంతా బాలకృష్ణ ఇన్నిగెటప్స్ వేసి ఒప్పించగలడు, ఇంత బాగా చేయగలడు అని చెప్పటానకి ప్రత్యేకంగా పనిగట్టుకుని తయారు చేసిన ప్రచార చిత్రంలా తయారైంది. కథా లోపమే కాక దశ, దిశ లేని దర్శకత్వం పాపం కూడా సినిమాను, బాలకృష్ణ ఇష్టంతో కష్టపడి చేసిన నటనాకౌశలాన్ని దారుణంగా దెబ్బతీసింది.
సినిమా ప్రారంభమైన చాలా సేపటికిగాని కథలోని సమస్యలోకి వెళ్ళకపోవటమే ఈ సినిమా కథకున్నప్రధాన సమస్య.అలాగే మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు కనపడి షాక్ ఇస్తాడు. మరో ప్రక్క కోడి రామకృష్ణ, బోయపాటి శ్రీను, జొన్నవిత్తుల, సింగీతం శ్రీనివాసరావు వంటి సినీ ప్రముఖులను చూపి ఆకట్టుకోవాలని చూడటం దాసరి వంటి మెగా దర్శకుడు ప్రయత్నించటం కూడా ఆశ్చర్యమనిపిస్తుంది. బాలకృష్ణతో కథకు సంభందం లేని వివిధ గెటప్స్, డైలాగులు, సెలబ్రేటీలను చూపటం ఇదంతా చూస్తుంటేనే ఏదో రకంగా ఒడ్డున పడాలని ప్రయత్నిచినట్లు స్పష్టంగా తెలిసిపోతూంటుంది. వీటిన్నట్టికీ తోడు హీరోయిన్స్ అమీషా పటేల్, షీలా, నేహా ధూపియా వీళ్ళలో ఒక్కరికీ సరైన పాత్ర, డైలాగులు, జస్టిఫికేషన్ ఉండదు. కేవలం బాలకృష్ణను ఎలా చూపాలా అని ఆలోచించి డిజైనా చేసినట్లుగా సినిమా అంతా జరుగుతూంటుంది.
ఇక సినిమాలో ప్లస్సులు లేవా అంటే అది బాలకృష్ణే. ఆయన నటన, డైలాగులు చెప్పే తీరు సినిమా సినిమాకూ పదునెక్కుతోందని స్పష్టం చేస్తుందీ చిత్రం. అలాగే క్లైమాక్స్ లో కోర్టులో చెప్పే డైలాగ్స్ కూడా బాగుంటాయి.అయితే డైలాగులు కొన్ని చోట్ల బాగానే పేలాయి. అయితే ధియోటర్ నుంచి బయిటకు వచ్చాక ఏదీ గుర్తుండే అవకాశమేలేదు. ఇక పాటల విషయానికి వస్తే మణిశర్మ అప్పుడప్పుడూ ఎవియస్ చిత్రాలకు ఇచ్చిన సంగీతంలా నీరసంగా ఉంటుంది. నేపధ్య సంగీతమూ అదే రేంజిలో ఏడ్పిస్తుంది. కెమెరా, మేకప్, ఎడిటింగ్, ఆర్ట్ దాదాపు అన్ని విభాగాలు దాసరి గారి పురాతన దర్శకత్వానికి పోటీ పడి పనిచేసాయి.పైనల్ గా ఈ చిత్రం బాలకృష్ణకు ఎలాంటి దర్శకులను, కథలను ఎంచుకోవాలి అన్న విషయంలో స్ఫష్టమైన ఆలోచనలు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సింహాతో పోల్చుకుంటే ఈ చిత్రం ఎక్కడ దెబ్బతిందో ఇట్టే కనిపెట్టేయచ్చు. అలాగే అదే సమయంలో దాసరిగారు ఇంత దారుణమైన ప్లాపులు ఇవ్వకుండా ఉండటానికి ఏకైక మార్గం కొంతకాలం పాటు దర్శకత్వానికి దూరంగా ఉండటమే బెస్ట్ అని అప్పట్లో చాలా మంది చెప్పుకొచ్చారు .ఇదిలా ఉండగా బాలకృష్ణ కెరీర్ లో సంక్రాంతి బరిలో అతి చెత్త సినిమాగా పరమవీరచక్ర పేర్కొంది.