దాన‌వీర‌శూర‌క‌ర్ణ‌.. వెండితెర‌పై అదో సంచ‌ల‌నం

           విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌముడి న‌ట విశ్వ‌రూపం చూపిన‌ దాన‌వీర‌శూర‌కర్ణ చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌ముందుకు వచ్చి నేటికి స‌రిగా 45 ఏళ్లు. జ‌న‌వ‌రి 14, 1977న ఈ చిత్రం విడుద‌లైంది. నిజానికి అతి త‌క్కువ రోజుల్లో నిర్మాణం జ‌రుపుకున్న ఈ చిత్రంపై మొద‌ట్లో ఎవ‌రికీ పెద్ద‌గా అంచనాలు లేవు. ఈ చిత్రానికి క‌ర్త క‌ర్మ క్రియ అన్నీ తార‌క‌రాముడే. తెర వెనుక ముందూ అన్నీ ఆయ‌నే. సినిమా తుదివ‌ర‌కూ క‌నిపించే మూడు ప్రధాన పాత్ర‌ల్లో న‌టిస్తూ ఆ సినిమాకు ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు నిర్వ‌హించ‌డ‌మంటే అదో అసిధార వ్ర‌తం. క‌త్తిమీద సాము.. నిజానికి అంత‌కుమించి. అయినా ఆ ప‌నిని భుజాల‌పైకెత్తుకున్న‌ది అసాధ్య‌మ‌న్న మాట‌కు అర్థం తెలియ‌ని ఎన్టీఆర్‌. అందుకే ఆ చిత్రం పౌరాణిక చిత్రాల‌కే త‌ల‌మాణిక‌మైంది. శ్రీకృష్ణుడిగా, సుయోధ‌నుడిగా, క‌ర్ణుడిగా ఆయ‌న న‌ట‌న అనిత‌రసాధ్యం. సాంకేతిక‌త కంటే త‌న‌ స‌మ‌ర్థ‌త‌ను మాత్ర‌మే న‌మ్ముకోవ‌డం తార‌క‌రాముడికే చెల్లు. రారాజు పాత్ర‌లో ఎన్టీఆర్ న‌టన‌కు జ‌నం నీరాజ‌నాలు ప‌ట్ట‌డంతో ఈ చిత్రం రికార్డుల రారాజుగా నిలిచిందన్న‌ది, తెలుగు చ‌ల‌న చిత్ర  చ‌రిత్ర‌లో సువ‌ర్ణాక్ష‌రాత్యాల‌తో లిఖించ‌బ‌డిన స‌త్యం.

        అప్పుడూ ఇప్పుడూ ఎప్పుటి లెక్క‌ల ప్ర‌కారం చూసుకున్నా సరే.. పౌరాణిక‌ చిత్రం తెర‌కెక్కించాలంటే భారీ సెట్టింగ్‌లు కావాల్సిందే. అందులోనూ మ‌హాభార‌త క‌థ కావ‌డం, కురుక్షేత్ర యుద్ధం స‌న్నివేశాలున్న చిత్రం కావ‌డంతో మ‌రిన్నిజాగ్ర‌త్త‌లు, చిత్రీక‌ర‌ణ‌కు నెల‌ల త‌ర‌బ‌డి స‌మ‌యం  అవ‌స‌రం. కానీ 4 గంట‌ల‌కు పైగా నిడివితో రూపొంది, ప్రేక్ష‌కుల‌ను మెప్పించి అపురూప విజయం సాధించిన దాన‌వీర‌శూర‌క‌ర్ణ చిత్రం తెర‌కెక్కించ‌డానికి ఎన్టీఆర్ తీసుకున్న స‌మ‌యం ఎంతో తెలుసా..?  కేవ‌లం 43 రోజులు. న‌మ్మ‌శ‌క్యం కాకున్నా ఇది వాస్త‌వం. అదీ క‌థ‌, స్క్రీన్‌ప్లే ద‌ర్శ‌క‌త్వంతో పాటు నిర్మాణ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తూ దీన్ని సుసాధ్యం చేసిన ఎన్టీఆర్‌ను చూసి సినిమా ప‌రిశ్ర‌మ వ‌ర్గాలే ఆశ్చ‌ర్యంతో చూస్తూండిపోవ‌డ‌మే కాదు.. ఆ చిత్రంలో ఆయ‌న న‌ట‌న‌, అది సాధించిన విజ‌యం చూశాక ఎన్టీఆర్ ఒన్ అండ్ ఓన్లీ అని మ‌రోసారి ఒప్పుకుని సెల్యూట్ చేశార‌ట‌. ఇక ఈ చిత్రం సంభాష‌ణ‌లు ఎంత పాపుల‌ర్ అంటే, వాటి ఎల్పీలు, క్యాసెట్స్ అమ్ముడైన సంఖ్య‌లో మరే భార‌తీయ భాషా చిత్రాల‌వీ ఇప్ప‌టిదాకా అమ్ముడుపోలేదంటే అర్థం చేసుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: