థర్డ్ వేవ్ కు ఒమిక్రాన్ ప్రధాన కారణమా..?

NAGARJUNA NAKKA
సౌతాఫ్రికాలో గుర్తించిన ఒమిక్రాన్ కరోనా వేరియంట్ భారత్ లో థర్డ్ వేవ్ కు కారణం కావొచ్చని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ పద్మశ్రీ మనీంద్ర అగర్వాల్ తెలిపారు. అయితే ఈ వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ఇప్పుడే అంచనా వేయలేమన్నారు. వ్యాక్సిన్ కంటే సహజ రోగ నిరోధక శక్తి ఈ వేరియంట్ ను ఓడించగలదని ఆయన అన్నారు. దేశంలో 80శాతం జనాభాలో సహజ రోగ నిరోధక శక్తి బలోపేతం అయిందని చెప్పారు.
ఒమిక్రాన్ థర్డ్ వేవ్ వస్తుందనే భయంతో.. మన దేశంలో అనేక మంది ప్రజలు బూస్టర్ డోస్ తీసుకుంటున్నారు. ప్రభుత్వం రెండు డోసుల విధానాన్నే కొనసాగిస్తుండగా.. ప్రైవేట్ వ్యాక్సిన్ కేంద్రాల్లో డబ్బు చెల్లించి బూస్టర్ డోస్ వేయించుకుంటున్నారు. అయితే దీనికి ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. అయితే బూస్టర్ డోస్ పై త్వరలో విధానం ప్రకటించనున్న కేంద్రం.. ప్రస్తుతానికి ఇంకా వ్యాక్సిన్ తీసుకోని వారిపై దృష్టి పెట్టింది.
మరోవైపు ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తున్న కారణంగా పలు దేశాలు మళ్లీ కఠిన ఆంక్షలు అమలుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ తీసుకోని వారిపై చర్యలకు ముంబయి అధికార యంత్రాంగం నడుం కట్టింది. అందరూ టీకా తీసుకోవాలనీ.. వ్యాక్సిన్ తీసుకోని వారికి జరిమానా విధిస్తామని మేయర్ కిశోరి పడ్నేకర్ ప్రకటించారు. వ్యాక్సిన్ తీసుకోని వారిని ప్రజా రవాణాకు అనుమతించబోమని స్పష్టం చేశారు.
ఇక ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన 12దేశాల నుంచి తెలంగాణకు వచ్చే ప్రయాణీకులపై ఆంక్షలు విధిస్తున్నట్టు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తామన్నారు. పాజిటివ్ వస్తే గచ్చిబౌలి టిమ్స్ కు తరలిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు దేశంలో.. రాష్ట్రంలో ఒమిక్రాన్ ప్రవేశించలేదనీ.. అసత్య ప్రచారాలను నమ్మొద్దని కోరారు. మొత్తానికి ఒమిక్రాన్ మాత్రం ప్రపంచ దేశాలను కలవరానికి గురిచేస్తోంది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: