ఏపీ వైపు చూడొద్దురో ...?

Satya
టౌన్ పక్కకెళ్ళద్దురో డింగరీ అని వెనకటికి ఒక జానపద గీతం ఉంది. ఇపుడు అలాగే మరో పాటను అదే రైమింగ్ తో టైమింగ్ తో పాడుకోవాల్సి ఉందేమో. ఏపీలో చూస్తే సినీ వర్గాలకు పరిస్థితులు అంత అనుకూలంగా లేవు అనే చెప్పాలి. టాలీవుడ్ అయితే హైదరాబాద్ లో ఉంది.
అమరావతికి హైదరాబాద్ కి ఎంత దూరం భౌతికంగా ఉందో తెలియదు కానీ ప్రభుత్వ సారధులకు టాలీవుడ్ పెద్దలకు మాత్రం దూరం బాగానే పెరుగుతోంది అంటున్నారు. దానికి అతి ముఖ్య కారణం ఆన్ లైన్ టికెటింగ్ విధానం. ఆన్ లైన్ టికెటింగ్ విషయంలో ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసింది. ఫలితంగా ప్రభుత్వ పోర్టల్ ద్వారానే టికెట్ల అమ్మకాలు సాగుతాయి. దాంతో పాటు బెనిఫిట్ షోలకు అసలు అనుమతి లేదు.
ఈ పరిణామంతో టాలీవుడ్ కి ఇబ్బందులే ఎదురవుతాయని అంటున్నారు. ఉమ్మడి ఏపీలో ఎలా సీన్ ఉన్నా విభజన తరువాత టాలీవుడ్ మొత్తంగా హైదరాబాద్ లో లోకేట్ అయి ఉంది. దాంతో ఏపీకి టాలీవుడ్ కి సంబంధాలు  అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే ఏపీలో ఎక్కువ థియేటర్లు ఉన్నాయి. రెవిన్యూ కూడా ఇక్కడే ఎక్కువ. కొత్త సినిమాలు స్టార్ హీరోల మూవీస్ వచ్చినపుడు బెనిఫిట్ షోలు వేసుకుంటారు. అలాగే టికెట్ల రేట్లను కూడా ఉన్న దానికి ఎక్కువగా పెంచుతున్నారు.
అయితే ఇపుడు వాటికి చెక్ పెడుతూ సినిమా ఆట కట్టించేశారు ప్రభుత్వ పెద్దలు. ఇపుడు పాన్ ఇండియా లెవెల్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటికి పెట్టిన మొత్తం కూడా వందల కోట్లలో ఉంది. అంతా రాబట్టాలి అంటే కచ్చితంగా టికెట్ల రేట్లు పెంచాల్సిందే. బెనిఫిట్ షోస్ ఉండాల్సిందే. అయితే ప్రభుత్వ విధానం వల్ల ఇపుడు అవన్నీ ఆగిపోయాయి. మరి టాలీవుడ్ దీని మీద ఏం చేస్తుందో చూడాలి. ఏది చేసినా కూడా చట్టంలో మార్పులు అయితే తెచ్చారు. దాంతో ఏపీ వైపు చూడొద్దురో అనుకోవాలేమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: