క‌ళా'మా'త‌ల్లి : మోహ‌న్ బాబు కు టీఆర్ఎస్ క్లీన్ చిట్ !

RATNA KISHORE
ఎవ్వ‌రూ ఇక్క‌డ స్వార్థ ప‌రులు కాదు.. అంతా తెలుగు నేల‌పై విల‌సిల్లే క‌ళల త‌ల్లికి సేవ‌లు చేసేవారే! అందుకే మా ఎన్నిక‌ల్లో ఏ గొడ‌వ‌లూ లేవు. మోహ‌న్ బాబు కు ఏ స్వార్థ‌మూ లేదు. ఆయ‌నంతా నిక్క‌చ్చిగా పోతారు. మాట సూటి..ముక్కు కూడా సూటి!అందుకే ఆయ‌న సూటిపోటి మాట‌లు ఏవీ అన‌రు. ఆయ‌న మ‌హోన్న‌త వ్య‌క్తి. స‌మాజ హితైషి అంటే అంద‌రి మంచీ కోరుకునే మంచి వాడు అని! మంచి వాడు అని చెప్పింది త‌ల‌సాని.. విని న‌వ్వి హాయిగా ఉంది ఈ ప్ర‌శంస అని పొంగిపోయింది మోహ‌న్ బాబు మ‌రియు ఆయ‌న కొడుకు విష్ణు బాబు.

స‌మాజ హితం అన్న‌ది మోహ‌న్ బాబు ధ్యేయం.. ఈ మాట ఎవ‌రు అన్నారు. త‌ల‌సాని అన్నారు. త‌మ అనుబంధం రీత్యా ఆ మాట అన్నారు. బాగుంది. ప‌ర‌స్ప‌రం పొగు డుకునేందుకే మా అధ్య‌క్ష ప‌ద‌వీ ప్ర‌మాణ స్వీకార స‌భ వేదిక కావ‌డం బాగుంది. రాజ‌కీయ నాయ‌కుల‌ను, న‌టుల‌ను వేరు చేసి చూడ‌లేం క‌నుక టీఆర్ఎస్ ను ఒక‌నాడు వ్య‌తిరేకించిన మోహ‌న్ బాబు ఇప్పుడు అదే పార్టీ కి చెందిన మంత్రి వ‌ర్యుల‌తో అభినంద‌న‌ల మందార మాల వేయించుకుని, త‌న రూటే సెప‌రేటు అన్న డైలాగ్ కు ఇప్ప‌టిదాకా ఉన్న డైలామాకు ఓ అర్థం చెప్పారు.

తీవ్ర‌మ‌యిన ఉత్కంఠ‌త‌ను రేపిన మా ఎన్నిక‌లు, త‌రువాత ఫ‌లితాలు అన్న‌వి నాటకీయంగా తేలాయి. ఎన్నిక‌లు నాట‌కీయంగా జ‌రిగాయి. త‌రువాత జ‌రిగిన ప‌రిణామాలు నాట‌కీయ‌త‌కు ఉన్న స్థాయిని పెంచి పోషించాయి. ఇంకా కొన్ని జ‌రిగాయి. కొన్ని జ‌ర‌గ‌కుండా ఉంటే  బాగుండు అన్న విధంగా ప‌రిణామాల్లో మార్పు ఉంటే మేలు అన్న విధంగా ఘ‌ట‌న‌లు న‌మోదు అయ్యాయి. ఇన్నీ జ‌రిగాక మోహ‌న్ బాబు కు తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన మంత్రి, ఆయ‌న స్నేహితుడు త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఆయ‌నెప్పుడు స్వ‌లాభం చూసుకోరు అని కూడా చెప్పారు. ఇండ‌స్ట్రీ పెద్ద‌లంతా ఇది విని అవాక్క‌య్యారు. ఆ పాటి స్వ‌లాభం అన్న‌దే లేక‌పోతే విష్ణు మా అధ్య‌క్షుడు అయ్యేవాడా లేదంటే ఆ పాటి స్వ‌లాభం అన్న‌ది ఆయ‌న‌లో లేక‌పోతే ఇవాళ ఇంద‌రిని ఇన్ని విధాలుగా తిట్లు తిట్టేవాడా?

ప‌రిశ్ర‌మ‌ను ప్ర‌స‌న్నం చేసుకోవాల్సిన అవ‌స‌రం త‌ల‌సానికి ఏమొచ్చింది అన్న ప్ర‌శ్న కూడా ఇదే స‌మ‌యంలో వినిపిస్తోంది. ఏదేమైన‌ప్ప‌టికీ కొత్త కార్య‌వ‌ర్గంలో ఉన్న‌వారంద‌రికీ త‌న మ‌ద్ద‌తు ఎన్న‌డూ ఉంటుంద‌ని కూడా తేల్చారు త‌ల‌సాని. ఇదే సంద‌ర్భంలో కొత్త హామీలు ఏమీ ఇవ్వ‌కుండానే వెనుదిరిగారు. సినీ ఇండ‌స్ట్రీ అంటే ఎన్నో స‌మ‌స్య‌ల‌కు నెల‌వుగా ఉంద‌న్న విష‌యం తెలిసి కూడా..ఎప్ప‌టిలానే కేసీఆర్ ను కీర్తించి, మోహ‌న్ బాబును ప‌నిలో ప‌నిగా ప్ర‌శంసించి వెళ్లిపోయారే త‌ప్ప ఈ రంగం సంక్షేమానికో, అభివృద్ధికో ఏం చేస్తాను అన్న‌ది చెప్ప‌నే చెప్ప‌లేదు. ఆఖ‌రికి ఒక్క విష‌యం మాత్రం ఒప్పుకుని వెళ్లారు.. మా ఎన్నిక‌లు క‌న్నా ఈ ఎన్నిక‌లే తీవ్ర‌మ‌యిన ఆందోళ‌న‌ల‌కు కార‌ణం అయ్యాయ‌న్న ధ్వ‌నిలోనే మాట్లాడి వెళ్లారు. ఇప్పుడు విష్ణు బాబు ఈ మాట‌లు విన్నాక ఏమ‌యినా సంఘంలోనూ దాని ప్ర‌వ‌ర్త‌న‌లోనూ మార్పు తీసుకు వ‌స్తారో లేదో అన్న‌ది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

maa

సంబంధిత వార్తలు: