బుల్లితెర వైపు బడా హీరోల మోజు..!

NAGARJUNA NAKKA
కరోనా బాలీవుడ్ ను తీవ్రంగా దెబ్బతీసింది. లాక్ డౌన్ కారణంగా.. షూటింగుల్లేక.. ఆర్టిస్టులు తినడానికి తిండికూడా లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలు.. థియేటర్లు మూతపడటంతో ఓటీటీలకే పరిమితమయ్యాయి. దక్షిణాది చలన చిత్ర పరిశ్రమ అయితే ఇప్పుడిప్పుడే ట్రాక్ లో పడుతోంది. కానీ బాలీవుడ్ మాత్రం మళ్లీ యథాస్థితికి రావడానికి చాలా సమయమే పడుతుంది.
సౌత్‌ ఇండస్ట్రీ అయినా కరోనా తర్వాత కొంచెం కోలుకుంది గానీ, బాలీవుడ్‌ మాత్రం ఇంకా నష్టాల్లోనే ఉంది. మహారాష్ట్రలో పెరుగుతోన్న కేసులు, ప్రపంచవ్యాప్తంగా పడిపోతోన్న థియేటర్ బిజినెస్‌లతో బడా హీరోల సినిమాలు సెట్స్‌లోనే ఉండిపోయాయి. దీంతో బాలీవుడ్‌ టాప్ హీరోలంతా వెబ్‌ సీరీసుల వైపు వెళ్తున్నారు. షారుఖ్ ఖాన్‌ 'జీరో' తర్వాత మూడేళ్ల గ్యాప్‌ తీసుకున్నాడు. ఈ లాంగ్ గ్యాప్ తర్వాత స్పీడ్‌గా సినిమాలు చేయాలని సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో 'పఠాన్', అట్లీతో ఒక మాస్ ఎంటర్‌టైనర్, అలాగే రాజ్‌కుమార్ హిరాణితో ఒక సినిమాకు ప్లాన్ చేసుకున్నాడు. కానీ సడన్‌గా వచ్చిన సెకండ్‌ వేవ్‌తో షారుఖ్‌ స్పీడ్‌కి బ్రేకులు పడ్డాయి. షారుఖ్‌ ఖాన్‌ సినిమా అంటే మినిమం 150 నుంచి 200 కోట్ల వరకు ఖర్చు ఉంటుంది. కానీ థియేటర్‌ బిజినెస్ ఇంకా గాడిన పడలేదు. థర్డ్‌ వేవ్‌ భయం కూడా వెంటాడుతోంది. ఇలాంటి సమయంలో థియేటర్‌ ఎక్స్‌పీరియెన్స్ కథలు చేయడం కంటే, వెబ్‌ సీరీసులు చేయడం బెటర్‌ అని ట్రేడ్‌ వర్గాలు కూడా చెబుతున్నాయి. అందుకే షారుఖ్‌ డిస్నీ హాట్ స్టార్ కోసం ఒక వెబ్‌ సీరీస్‌కి సైన్ చేశాడని తెలుస్తోంది.  
హృతిక్ రోషన్‌ సినిమా విడుదలువుతుంది అంటే ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతారు. మహిళా అభిమానులు కూడా థియేటర్ల దగ్గర హంగామా చేస్తారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ థియేటర్లకి వెళ్లే సాహసం చేయడం లేదు. అందుకే వాళ్లని పలకరించేందుకు వెబ్‌ సీరీస్‌తో స్మార్ట్ వరల్డ్‌లోకి వెళ్తున్నాడు హృతిక్. డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో బ్రిటీష్‌ టీవీ సీరీస్‌ 'ది నైట్ మేనేజర్' రీమేక్‌లో నటిస్తున్నాడు హృతిక్. లార్జ్‌ స్కేల్‌ సినిమాలు ఇప్పుడు థియేటర్లలో విడుదలయినా.. ఆ రేంజ్‌లో వసూళ్లు రావడం లేదు. ముఖ్యంగా నార్త్‌ ఇండియాలో థియేటర్లు ఇంకా పూర్తిగా తెరుచుకోలేదు. పెద్ద సినిమాలు విడుదలైనా ఎగ్జిబిటర్లకి నష్టాల తప్పడం లేదు. దీంతో పెద్ద హీరోలు చిన్న తెరల్లోకి వెళ్తున్నారు. వెబ్‌ సీరీసులతో ఆడియన్స్‌ దగ్గరికి వెళ్తున్నారు. షాహిద్‌ కపూర్‌ మాత్రం రెండు సీరీసులకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. రాజ్, డికె దర్శకత్వంలో 'సన్నీ' అనే ఒక వెబ్‌ సీరీస్‌ చేస్తున్నాడు. ఈ సీరీస్‌లో రాశిఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో ఒక వార్‌డ్రామా కూడా చేయబోతున్నాడు షాహిద్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: