ముగిసిన ఇందిరా దేవి గారి అంత్యక్రియలు!

Purushottham Vinay
ముగిసిన ఇందిరా దేవి గారి అంత్యక్రియలు!
సీనియర్ హీరో, సూపర్ స్టార్ కృష్ణ గారి సతీమణి.. మహేష్ బాబు గారి తల్లి ఇందిరా దేవి గారి అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‏లోని మహా ప్రస్థానంలో సాంప్రదాయ పద్ధతిలో తల్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు మహేష్ బాబు.తమ అభిమాన హీరో తల్లిని కడసారి చూసేందుకు భారీగా సూపర్ స్టార్ అభిమానులు తరలివచ్చారు. పద్మాలయ స్టూడియో నుంచి మహా ప్రస్థానం వరకు కొనసాగిన అంతిమ యాత్రలో ఘట్టమనేని కుటుంబసభ్యులతోపాటు.. సినీ ప్రముఖులు..అభిమానులు పాల్గొన్నారు. ఇందిరా దేవి గారి మృతితో ఘట్టమనేని కుటుంబంలో ఒక్కసారిగా విషాదచాయలు అలుముకున్నాయి. తల్లి పార్థివదేహాన్ని చూసి కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరా దేవి గారు బుధవారం తన నివాసంలోనే తుది శ్వాస విడిచారు. 


ఇందిరాదేవి గారు సూపర్ స్టార్ క్రిష్ణ గారికి మొదటి భార్య. వీరికి ఐదుగురు సంతానం. ముగ్గురు అమ్మాయిలు పద్మ, మంజుల, ఇందిర ప్రియదర్శిని.. అబ్బాయిలు రమేష్ బాబు, మహేష్ బాబు. ఇద్దరు కొడుకులు ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసి తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు.ఏ రోజూ సినీ వేడుకలకు హాజరు కావడానికి ఆసక్తి చూపించలేదు ఇందిరా దేవి గారు. ఈ ఏడాదిలోనే మహేష్ ఇంట రెండు విషాదాలు నెలకొన్నాయి. ఇటీవల అనారోగ్యంతో మహేష్ అన్న రమేష్ బాబు గారు మృతి చెందగా.. ఇప్పుడు తల్లి ఇందిరా దేవి గారు దూరం కావడంతో సూపర్ స్టార్ ఇంట తీవ్ర విషాదం అలుముకుంది.మహేష్ కూతురు సితార అయితే తన నాయనమ్మ మరణాన్ని తట్టుకోలేక కన్నీరుమున్నీరయ్యింది. తన నాయనమ్మతో సితారకు మంచి అనుబంధం వుంది. శ్రీమతి ఇందిరా దేవి గారి ఆత్మకు శాంతి కలగాలని ఇంకా మహేష్, కృష్ణ గారు ఇంకా వారి కుటుంబ సభ్యులకు ఈ బాధ నుంచి త్వరగా కోలుకునే శక్తి ఆ భగవంతుడు ప్రశాదించాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: