బాల‌య్య లైన‌ప్‌లో 6 సినిమాలు.. ఆ లిస్ట్ ఇదే..!

VUYYURU SUBHASH
యువరత్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్ లోనే ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్న బాలయ్య ఇటు బుల్లితెరపై ఆహా ఓటీటీ ప్లాట్ ఫాంలో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాప‌బుల్‌ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అటు అఖండ‌ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. బాలయ్య కెరీర్లోనే తొలి వంద కోట్ల సినిమాగా రికార్డులకు ఎక్కడంతో పాటు ఏకంగా రు. 125 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా త‌ర్వాత బాలయ్య వ‌రుస‌పెట్టి కొత్త సినిమాలు అంగీకరిస్తున్నాడు.
అఖండ‌ తర్వాత సినిమా క్రాక్ సినిమాతో హిట్ కొట్టి మంచి ఫామ్‌లో ఉన్న మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీస్ వాళ్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏప్రిల్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాలయ్య అనిల్ రావిపూడి తో చేస్తున్నాడు. అనిల్ రావిపూడి గతంలోనే బాలయ్యతో రామారావు గారు టైటిల్‌తో ఒక సినిమా ప్లాన్ చేసినా.. అది అనివార్య కారణాల వల్ల పట్టాలెక్కలేదు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో అదిరిపోయే సినిమా రానుంది.
ఇక ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘవేంద్రరావు రామానుజాచార్యులవారి క‌థ‌తో బాలయ్య హీరోగా ఒక సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బాలయ్యకు మూడు వరుస బ్లాక్బస్టర్ హిట్లు ఇచ్చిన బోయపాటి శ్రీను మరో పవర్ఫుల్ కథను రెడీ చేస్తున్నారు. ఈ సినిమాను వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి నిర్మించనున్నారు. అలాగే బాలయ్యకు గతంలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన సీనియర్ దర్శకుడు బి.గోపాల్ బాలయ్యతో మరో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇందుకోసం ఆయన ఓ కథను కూడా రెడీ చేసుకున్నట్టు గతంలోనే చెప్పారు. మరోసారి బాలయ్యతో సినిమా చేసేందుకు టైం కలిసిరావాలని గోపాల్ చెప్పారు. అలాగే సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్ గా ఆదిత్య 999 సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ వయసులో బాలయ్య ఏకంగా ఆరు కొత్త సినిమాలను లైన్ లో పెట్టడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: