ఆర్ఆర్ఆర్ : ఆనంద నిధి ఆ...నంది..

RATNA KISHORE
ఉన్నట్టుండి ఓ కుటుంబానికి క‌ష్టం వ‌చ్చింది. జేబుల్లో డ‌బ్బుల్లేని రోజొక‌టి వ‌చ్చింది. అంతేకాదు కొన్ని సార్లు ప‌స్తులుండాల్సిన రోజు కూడా వ‌చ్చింది. ఆ కుర్రాడు సిరివెన్నెల ఇంటికి వెళ్లాడు..కొత్త పుస్త‌కం ఒక‌టి ప‌ట్టుకు వ‌చ్చి..మీ సంతకం కావాలి అని అడిగి వెళ్లాడు..అటుపై ఎప్పుడూ ఒప్పుకోకు ఓటమి..ఎప్పుడూ వ‌దులుకోకు ఓరిమి పాట పూర్తిగా త‌న స్వ‌దస్తూరితో రాసి ఇచ్చి ఆల్ ద బెస్ట్ అని దీవించి పంపారు..ఆ రోజు నాన్న ద‌గ్గర‌కు వెళ్లాడు..మ‌నం ఇక‌పై ఎటువంటి క‌ష్టాలు ప‌డ‌వ‌ద్దు...ఈ పాటే మ‌న తోడు అని నాన్న మ‌రో సారి ఆ సిరివెన్నెల ద‌స్తూరిని ముద్దాడి బుజ్జాయికి మ‌రోమారు దీవెన‌లు అందించాడు..కొత్త ఏడాది ఆరంభం ఆ విధంగా జ‌రిగింది ఆ వేళ ఆ కుర్రాడికి.. నందీ నువ్వెందుకు ఇటు వ‌చ్చావ్ అన్న ఆ రైట‌ర్ పేరు సిరివెన్నెల సీతారామ శాస్త్రి..ఆ కుర్రాడి పేరు ఇప్పుడు మ‌నం పిలుచుకుంటున్న ద‌ర్శ‌క ధీర ఎస్ ఎస్ రాజమౌళి.


నాన్న ఏడ్చేశాడు
త‌ల్లి ఏడుపు ఆపుకుంటుంది
అన్న‌య్య స్వ‌ర సంచారి(కీర‌వాణి)గా ఉంటూ
కుటుంబానికి కాస్త అండ‌గా ఉన్నాడు



రాయ‌డం త‌ప్ప ఏమీ తెలియ‌ని నాన్న‌కు పెద్ద పేరుంది..ఆ పేరు విజ‌యేంద్ర ప్ర‌సాద్..నాన్న‌కు తోడుగా మ‌రొక‌రు ఉన్నారు ఆయ‌న శివ‌శ‌క్తి ద‌త్తా (కీర‌వాణి నాన్న‌)..ఇంద‌రున్నా క‌ష్టాలు కూడా తోడుగా ఉన్నాయి..అయినా కూడా ఆ కుటుంబం ఆ చెన్న‌య్ దారుల‌ను నిందించ‌లేదు.. త‌మ‌ని తాము నిందించుకోనూ లేదు.. అర్ధాంగి సినిమా తీసి డ‌బ్బులు పోగొట్టుకున్న రోజు నుంచి చెన్న‌య్ ఇంకా బాగా అర్థం అవుతుంది వాళ్ల‌కు.. ఆ కుటుంబం నేర్చుకున్న‌దంతా ఓట‌మి నుంచి.. ఓట‌మి నుంచి ఓట‌మి వ‌ర‌కూ ఎలా ఉండాలో నేర్చుకుని ఇప్పుడు ఓట‌మి నుంచి గెలుపు వ‌ర‌కూ ఎదిగారు.. బాహుబ‌లి త‌రువాత గెలుపు నుంచి గెలుపు వ‌ర‌కూ ఎలా ఉండాలో అలవాటు చేసుకున్నారు. ఉద‌య‌నిధి స్టాలిన్ ఓ మాట అన్నారు..అంతా సినిమా స‌క్సెస్ కోసం వెతుకుతారు కానీ రాజ‌మౌళి సినిమాలు సినిమా స‌క్సెస్ ను సెట్ చేసుకుని ఇటుగా వ‌స్తాయి ప్రేక్ష‌కుల‌ను కొత్త లోకాల‌కు తీసుకుని వెళ్తాయి అని! వాళ్లంతా కురిపించిన ప్రేమ నిన్న నేను చూశాను.. త‌మిళ తీరంలో తెలుగు గ‌ర్వం..తెలుగు పొగ‌రు..విని చూసి సంతోషించ‌డంలో ఆనందం ఉంది.. అదే గొప్ప నిధి..ఆనంద నిధి అని అందుకే అన్నాను.. ఆనంద నిధి.. ఆ నంది..అనండిక...
- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: