అఖండ థియేటర్లు సీజ్.. రాజకీయ కక్షేనంటారా..?

Deekshitha Reddy
సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. కానీ సినిమావాళ్లు రాజకీయాల్లో ఉంటే మాత్రం వారితో సినిమాలు చేసిన దర్శకులు, నిర్మాతలు కూడా సదరు నాయకులు కమ్ నటులు చేసే పనులకు, వ్యాఖ్యలకు ప్రతిఫలం అనుభవించాల్సిందే. ప్రస్తుతం ఏపీలో అఖండ ఫీవర్ నడుస్తోంది. తొలిరోజునుంచి ఇది ఫ్యాన్ మూవీ అనే టాక్ వచ్చేసింది. ఫ్యాన్స్ కి పూనకాలేనంటున్నారు. హిట్టు, సూపర్ హిట్టు, అంతకు మించి.. అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తోంది. అయితే అఖండ మూవీ బెనిఫిట్ షో వేసిన థియేటర్ ని అధికారులు సీజ్ చేయడం కూడా అంతే హాట్ టాపిక్ గా మారింది.
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం బెనిఫిట్ షో లు నిషేధం. రోజుకి 4 ఆటలు మాత్రమే వేయాలి. మల్టీప్లెక్స్ అయినా, పల్లెటూళ్లో చిన్న థియేటర్ అయినా ఇదే నిబంధన పాటించాలి. కానీ ఏపీలోని చాలా ప్రాంతాల్లో అఖండ బెనిఫిట్ షో ఉదయాన్నే పడింది. ఇటీవలే తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనను ప్రభుత్వం అంత త్వరగా అమలులోకి తెస్తుందో లేదో అనుకున్న థియేటర్ల యజమానులు బెనిఫిట్ షో వేశారు. అయితే అధికారులు మాత్రం వెంటనే రియాక్ట్ అయ్యారు. కృష్ణా జిల్లా మైలవరంలో సంఘమిత్ర థియేటర్ లోని ఓ స్క్రీన్ ని సీజ్ చేశారు. దీంతో బాలయ్య అభిమానులు గోల చేశారు. రాజకీయ కక్ష అంటూ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కు పెట్టారు.
గతంలో వకీల్ సాబ్ సినిమా రిలీజ్ టైమ్ లో కూడా ఇలాంటి ఆరోపణలే ప్రభుత్వంపై వచ్చాయి. ఇప్పుడు అఖండ మూవీ టైమ్ లో బెనిఫిట్ షో లు వేసిన థియేటర్లను సీజ్ చేసే సరికి మరోసారి సినిమావాళ్లపై రాజకీయ కక్షలంటూ ప్రచారం మొదలైంది. అయితే ప్రభుత్వ అధికారులు మాత్రం నిబంధనలు పాటించకపోతే ఎవరి సినిమా అయినా ఇలాగే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఇందులో రాజకీయాలకు తావులేదంటున్నారు.
బాలయ్యకు టీడీపీ సపోర్ట్..
అఖండ సినిమా హిట్ టాక్ నేపథ్యంలో టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ కుటుంబంలోని హీరోలంతా బాలయ్యకు శుభాకాంక్షలు చెప్పారు. అదే సమయంలో థియేటర్ సీజ్ వ్యవహారంపై మాత్రం టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాజకీయ కక్షతోనే ఇలా చేస్తున్నారంటూ మండిపడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: