ఆన్ లైన్ టికెట్లపై దర్శకేంద్రుని లేఖాస్త్రం...!

Podili Ravindranath
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా సినిమాటోగ్రఫి చట్టంలో చేసిన మార్పులపై ప్రభుత్వానికి సినీ ప్రముఖుల వినతులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆన్ లైన్ టికెట్ విధానాన్ని ప్రవేశ పెడుతు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చట్టం చేసింది. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని అప్పుడే మెగాస్టార్ చిరంజీవి ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ కారణంగా సినిమా పరిశ్రమకు ఇబ్బందులు వస్తాయని కూడా చిరంజీవి లేఖలో ప్రస్తావించారు. ఇప్పుడు తాజాగా  ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు కూడా ప్రభుత్వానికి లేఖ రాశారు. తాను 45 సంవత్సరాలుగా పరిశ్రమలో దర్శకుడిగా, నిర్మాతగా ఉన్న తమ అభిప్రాయం అర్థం చేసుకోవాలంటూ లేఖలో ప్రస్తావించారు. మూలాల్ని ఎవరూ ఎప్పుడూ మరిచిపోకూడదన్నారు. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి ప్రధాన కారణం ప్రేక్షకులు, థియేటర్ల యజమానులు, సినిమా డిస్టిబ్యూటర్లు, నిర్మాతలు అని అన్నారు. వీళ్లందరూ బాగుంటేనే పరిశ్రమ బాగుంటుందన్నారు.
ప్రస్తుతం టికెట్లు, షోల నిర్ణయం వల్ల చాలా మంది తీవ్ర నష్టాలకు గురవుతారని... కామన్ మ్యాన్‌కు కేవలం సినిమా మాత్రమే ఎంటర్‌టైన్‌మెంట్ అన్నారు. సరదా సరదాగా చూసే సినిమాని థియేటర్లలోని పెద్ద స్క్రీన్ పైన డీటీఎస్ - అట్మాస్, 3డీ చూసిన అనుభూతి టీవీల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదన్నారు. షోలు తగ్గించడం వల్ల, టికెట్ల ధరలు తగ్గించడం వల్ల పరిశ్రమలో చాలా మంది నష్టపోతారన్నారు. ఒక హిట్ సినిమా ఎక్కువ షోలు వేసుకున్నా, మొదటి వారం ధరలు పెంచుకోవడం వల్ల... తర్వాత కొన్ని మామూలు సినిమాలు వచ్చినా కూడా థియేటర్ల యజామాన్యం, వాళ్లను నమ్ముకున్న కొన్ని వేల మందికి 2, 3 నెలలకి సరిపడా ఆదాయం వస్తుంది. ప్రస్తుతం వంద సినిమాల్లో 10 శాతం హిట్స్ కూడా లేవు. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఆన్ లైన్ వల్ల దోపిడీ ఆగిపోతుంది అనడం కరెక్ట్ కాదు. మంచి సినిమా చూసేందుకు ప్రేక్షకులు టికెట్ ధర 300 అయినా, 500 రూపాయలు అయినా చూస్తాడు. ఒక రూపాయికే సినిమా చూపిస్తామన్నా.. అతనికి నచ్చని సినిమా చూడడు. పైగా ఆన్ లైన్ లో చాలా మంది టికెట్లు బ్లాక్ చేసుకుని, బ్లాక్‌లో అమ్ముకునే అవకాశం ఉంది. అదే రేట్లు పెంచి ఆన్‌లైన్‌లో అమ్మితే థియేటర్ల వలన ప్రభుత్వానికి ఎక్కువ ట్యాక్స్ వస్తుంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని తగిన న్యాయం చేయాలని ఆశిస్తున్నా అంటూ దర్శకేంద్రుడు లేఖలో విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: