వెల "సిరి" : సినీ పాటకు సాహిత్య గౌరవం తెచ్చిన మహానుభావుడు..!

NAGARJUNA NAKKA
కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తెలుగు సాహితీ లోకానికి, సినీ పరిశ్రమకు తీరని లోటుగా మిగిలిపోయింది. సినీ పాటకు సాహిత్య గౌరవాన్ని తెచ్చిన గొప్ప వ్యక్తి ఇక లేరనే వార్తను సాహితీ వేత్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. బలమైన భావాన్ని, మానవత్వాన్ని, ఆశావాదాన్ని చిన్నచిన్న మాటల్లో పొదిగి జన సామాన్యుల గుండెల్లో నిక్షిప్తం చేసేలా తెలుగు పాటను కొత్త పుంతలు తొక్కించిన మహనీయుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి.
విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన సిరివెన్నెల సీతారామశాస్త్రి అసలు పేరు చెంబోలు సీతారామశాస్త్రి. ఆయన 1955 మే 20న జన్మించారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సిరివెన్నెల సినిమాతో ఆయన పేరు సిరివెన్నెల సీతారామశాస్త్రిగా మారిపోయింది. 11నంది అవార్డులు, 4 ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, సంతోషం ఫిల్మ్ ఫేర్ అవార్డ్, SIIMA అవార్డ్ అందుకున్నారు. 3వేలకు పైగా పాటలు రాశారు. 2019లో పద్మశ్రీ పురస్కారం వరించింది. ఇలా ఎన్నో అవార్డులు లెజెండరీ లిరిక్ రైటర్ సిరివెన్నెల సీతారామ శాస్త్రిని వరించాయి. మూడు దశాబ్దాల క్రితం మొదలైన ఆయన సినీ ప్రయాణంలో.. ఎన్ని తరాలైనా గుర్తుండే ఎన్నో మధురమైన గీతాలు అందించారు.
దిగ్గజ సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి ఓ కార్యక్రమంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన మాటలు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. ప్రపంచమంతా పడుకున్నాక ఆయన లేస్తాడనీ.. సీతారామశాస్త్రి అర్ధరాత్రి ఉదయించే సూర్యుడన్నారు. అక్షరాలు అనే తూటాను తీసుకొని ప్రపంచం మీద వేటాడటానికి బయల్దేరుతాడు అంటూ సిరివెన్నెలను ఆవిష్కరించాడు మాటల మాంత్రికుడు.
ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతి లెజెండరీ డైరెక్టర్ కె.విశ్వనాథ్ కూడా స్పందించారు. సిరివెన్నెల మృతి నమ్మలేని నిజం. తనకు తీరని నష్టం అనీ.. తన ఎడమ భుజం రాలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతికలగాలన్నారు. సిరివెన్నెలను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది.. కె.విశ్వనాథ్. ఇక సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. కిమ్స్ ఆస్పత్రి నుంచి ఆయన పార్థీవ దేహాన్ని ఫిలిం ఛాంబర్ కు తరలించారు. అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్ లో ఆయన భౌతిక కాయం ఉంచారు. నేడు మహా ప్రస్థానంలో సీతారామశాస్త్రి అంత్యక్రియలు జరగనున్నాయి. ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి పేర్ని నాని అంత్యక్రియలకు హాజరుకానున్నారు.మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: