వెల 'సిరి' : సిరివెన్నెల మృతి: క‌న్నీళ్లు పెట్టిస్తోన్న కొటేష‌న్‌

VUYYURU SUBHASH
తెలుగు సినిమా పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంతో మంది ప్రముఖులు ఇటీవల కాలంలో ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. కొద్దిరోజుల క్రితమే ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ క‌రోనా తో మృతి చెందిన సంగతి తెలిసిందే. శివ శంకర్ మాస్టర్ మృతి నుంచి కోలుకోక మునుపే తెలుగు సినిమా పరిశ్రమకు మరో షాక్ తగిలింది. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ రోజు మృతి చెందారు.

కొద్ది రోజుల క్రితం ఆయన న్యూమోనియాతో బాధపడుతూ హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అయితే ఈ రోజు ఆయన ఆరోగ్యం విషమించడంతో మృతి చెందారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. సిరివెన్నెల‌ మృతి చెందిన విషయం తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తడంతో మృతి చెందినట్టు తెలుస్తోంది.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి మే 20 - 1955వ సంవత్సరంలో అనకాపల్లి లో జన్మించారు. ఇదిలా ఉంటే సిరివెన్నెల మృతి చెందిన తర్వాత ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొద్ది నెలల క్రితం మృతి చెందిన ఎస్పీ బాలసుబ్రమణ్యం - ఇటీవల మృతి చెందిన శివ శంకర్ మాస్టర్ - సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ ముగ్గురు ఫోటోలను జతచేసి పెట్టిన క్యాప్ష‌న్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కన్నీళ్లు పెట్టిస్తోంది.

ఆడటానికి ... పాడటానికి మీరు ఉంటే సరిపోతుందా ? నేను అక్కర్లేదా అందుకే నేను కూడా వచ్చే అంటూ సిరివెన్నెల పైన ఉన్న బాలు , శివ శంకర్ మాస్టర్ వద్దకు వెళ్లి పోతున్నట్లు చెప్పిన ఈ కొటేషన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేస్తోంది. ఈ ఫొటో ను ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక సిరివెన్నెల మృతి ప‌ట్ల ప‌లు సినిమా రంగాల‌కు చెందిన వారు త‌మ సంతాపం తెలియ జేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: