టాలీవుడ్ అతి పెద్ద ముప్పు... తగ్గుతుందా ? నెగ్గుతుందా ?

Vimalatha
టాలీవుడ్ కు అతి పెద్ద ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే కరోనా, లాక్ డౌన్, తద్వారా బడ్జెట్ ప్రాబ్లమ్స్ అంటూ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న చిత్ర పరిశ్రమను ఇబ్బంది పెట్టడానికి మరో అతి పెద్ద సమస్య సిద్ధంగా ఉంది. నిజానికి ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. టికెట్ రేట్ల సమస్య ఇంకా వెంటాడుతూనే ఉంది. మూలుగుతున్న నక్కపై తాటికాయ పడ్డట్లు కరోనా థర్డ్ వేవ్ రెడీ అయిపోతోంది. మరోవైపు ఒమిక్రాన్ అంటూ కొత్త వేరియెంట్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు కొత్త మహమ్మారిని ఎదుర్కోవడానికి అలెర్ట్ అయ్యాయి. కానీ అది వచ్చిందంటే మరోమారు లాక్ డౌన్ వంటి సమస్యలు తప్పవని ప్రజలు భావిస్తున్నారు. అదే గనుక జరిగితే చిత్ర పరిశ్రమ ఊబిలో కూరుకుపోయినట్లే. రెండు వేవ్స్ ఇప్పటికే చిత్ర పరిశ్రమను కుదేలు చేయగా, ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే ఓ గాడిన పడుతోంది. మళ్ళీ కింద పడితే అధఃపాతాళానికే...
ఈ డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది వేసవి కాలం వరకు వరుసగా పెద్ద సినిమాలు రంగంలోకి దిగబోతున్నాయి. డిసెంబర్ 2న నందమూరి బాలకృష్ణ అఖండ, డిసెంబర్ 17న ఐకాన్ స్టార్ అల్లు అర్జున పుష్ప, డిసెంబర్ 24న నేచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గని చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక జనవరిలో బాక్స్ ఆఫీస్ పండగే. జనవరి 7న అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న "ఆర్ఆర్ఆర్", జనవరి 12న 'భీమ్లా నాయక్", జనవరి 14న "రాధేశ్యామ్" సంక్రాంతి బరిలో పోటీ పడబోతున్నాయి. అయితే ముందుగా ఈ రేసుకు సిద్ధమైన మహేష్ బాబు 'సర్కారు వారి పాట' చిత్రం వాయిదా పడింది. పెద్ద చిత్రాల నిర్మాతలు అందరూ రిలీజ్ డేట్ కోసం తన్నుకు చస్తుంటే మీ చావు మీరు చావండి. నన్ను మాత్రం ఒంటరిగా వదిలేయండి అంటూ కొత్త రీలిజ్ డేట్ ను ప్రకటించింది. ఏప్రిల్ 1న సోలో బ్రతుకే సో బెటర్ అంటూ సింగిల్ గా రానున్నాడు మహేష్. అయితే ఇప్పుడు గనుక కరోనా లేదా కొత్త వేరియంట్ మరోమారు పంజా విసిరితే ఈ ప్లాన్స్ అన్నీ తలక్రిందులు అవుతాయి.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: