థియేటర్లు ఖాళీ.. అంతా కూడబలుక్కున్నారు... ?

Satya
తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా మూడు వేల పై చిలుకు థియేటర్లు ఉన్నాయి. కరోనా పుణ్యమాని ఎన్నడూ లేని విధంగా నెలల తరబడి సినిమా హాళ్ళు మూతపడ్డాయి. అయితే కరోనా తగ్గడంతో మెల్లగా థియేటర్లను ఓపెన్ చేశారు. అయితే ఆ సంతోషం ఎగ్జిబిటర్లకు ఉందా అంటే జవాబు అందరికీ తెలిసిందే.
థియేటర్లు మాత్రమే తెరచుకున్నాయి. అక్కడ అంతా ఖాళీయే. జనాలు సినిమా హాళ్ల వైపు తొంగి చూడడంలేదు. దాంతో ఈగలు తోలుకుంటున్నాయనే చెప్పాలి. సరైన సినిమాలు లేకపోవడం వల్లనే సినిమా హాళ్ళు బోసిపోయాయని అంటున్నారు. బొమ్మ పడాలి అని అంతా అంటున్నారు కానీ తమ బొమ్మలను మాత్రం జాగ్రత్తగా దాచిపెట్టుకుంటున్నారు.  దాంతో సినిమా హాళ్ళు ఎందుకు తెరచామురా బాబూ అని థియేటర్ యాజమాన్యాలు బాధపడుతున్నారు.
ఇక పెద్ద సినిమాలు అయితే నెలల తరబడి చూసినా కూడా  ఒక్కటీ రావడంలేదు. కరోనా రెండవ దశ తరువాత అన్నీ మీడియం మూవీస్, అలాగే  లో బడ్జెట్ మూవీస్ వస్తున్నాయి. దాంతో సినిమాలకు ఏ కోశానా  స్టఫ్ సరిపోవడంలేదు. ఇక అందరికీ సంక్రాంతి సీజనే కావాలి. అపుడు మాత్రం థియేటర్లు అసలు ఖాళీగా ఉండవు. ఈ మధ్యలో ఉన్న ఎన్నో  నెలలను ఏం చేశారు అంటే ఎవరూ కూడా అసలు జవాబు చెప్పలేరు. అంటే సీజనల్ గానే పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ చేసుకుని ఆ పండుగ సందట్లో నాలుగు డబ్బులు వెనకేసుకుని పోతున్నారు. మరి మిగిలిన అన్ని నెలలూ ఎలా అంటే ఖాళీగా థియేటర్లు నడపడమేనా అని ఎగ్జిబిటర్లు  గోల పెడుతున్నారు. అంతా కూడబలుక్కుని ఒకే సీజన్ మీద దండెత్తే బదులు ప్రతీ నెలలో కనీసం రెండు మూడు పెద్ద సినిమాలు ఉండేలా చూసుకుంటే బాగుంటుంది కదా అన్నదే వారి సూచన. మరి దీనిని బడా మేకర్స్ వింటారా. తాము కూడా చింత్ర పరిశ్రమలో భాగమేనని, అందువల్ల తమ గోడు కూడా పట్టించుకోవాలని వారు కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: