"ఆడవారిని" థియేటర్ కి పరుగులు పెట్టించిన చిత్రం ఇదే?

VAMSI
తెలుగు ఇండస్ట్రీలో నాటి నుండి నేటి వరకు కూడా హీరోల డామినేషన్ ఎక్కువనే చెప్పాలి. హీరోకి ప్రాధాన్యం ఉన్న కథలే ఎక్కువగా వస్తుంటాయి. హీరోయిన్ అంటే సినిమాకి గ్లామర్ అట్రాక్షన్ మాత్రమే అన్నట్టుగా ఉంటాయి. అయితే హీరోయిన్ కి ప్రాధాన్యమిచ్చే చిత్రాలు చాలా తక్కువే. హీరోయిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కే చిత్రాలు కూడా తక్కువే. అందులోనూ లేడి ఓరియంటెడ్ కథలు తెరకెక్కించడం అంటే నిజంగా ఒక పెద్ద ప్రయోగమే అని అనుకునేవారు. కానీ హీరోయిన్ విజయశాంతి, రోజా వంటి వారు ట్రెండ్ ను మార్చి వారి బ్రాండ్ ను సెట్ చేశారు. హీరోయిన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండే చిత్రాలను ఎంచుకుని ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక చలన చిత్రచరిత్రలో అటువంటి సినిమాలు ఏమున్నాయి అని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా మొదట గుర్తు వచ్చే చిత్రం "ఒసేయ్ రాములమ్మ".
తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ చిత్రం టాలీవుడ్ సినీ చరిత్రలో ఒక  మైలురాయి. "ప్రతిఘటన" వంటి చిత్రం తర్వాత అదే తరహాలో తెరకెక్కిన చిత్రం "ఒసేయ్ రాములమ్మ" కావడం విశేషం. 1997 లో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు బాక్సాఫీస్ బరిలో అప్పటికే నలుగురు స్టార్ హీరోల చిత్రాలు పోటీలో ఉన్నాయి. అయినా వాటిని కూడా అధిగమించి ప్రేక్షకులను తమ వైపుకున్న ఈ చిత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే. పూలన్ దేవి స్ఫూర్తితో మహిళా ప్రాధాన్యత ఎక్కువగా ఉండే ఒక పిరియాడికల్ చిత్రాన్ని తెరకెక్కించాలని సంకల్పించాడు దర్శకరత్న దాసరి నారాయణరావు. అనుకున్నదే తడవు తన పనిని మొదలు పెట్టి ఒక అద్భుతమైన కథను రాయాలని పూనుకున్నాడు. అదే విషయాన్ని సినీ ప్రముఖులు ఆర్.నారాయణమూర్తితో చర్చించగా ఆయన తెలంగాణ నేపథ్యంలో మీరు అనుకుంటున్న కథకు ఆ బ్యాక్ డ్రాప్ ను జోడిస్తే బాగుంటుంది అని చెప్పారు.
ఆ ఐడియాతో అప్పట్లో  తెలంగాణ పోరాటం, నిజాం పాలన, రజాకార్లు, దొరల పాలన వంటి అంశాల గురించి ఎన్నో పుస్తకాలు చదివి అవగాహన తెచ్చుకొని వాటి ఆధారంగా కథను నిర్మించుకున్నారు. మొదట ఈ చిత్రానికి "రాములమ్మ" అనే టైటిల్ ను అనుకోగా సినీ ప్రముఖులు సంజీవ్ ముందు ఒసేయ్ అని చేర్చి ఒసేయ్ రాములమ్మ అంటే కథకు సరిగ్గా నప్పుతుంది అనడంతో అలా టైటిల్ ను ఫైనల్ చేశారట . సినిమా రిలీజ్ అయ్యాక ఆ టైటిల్ కు వచ్చిన స్పందన చూసి అప్పుడు తీసుకున్న నిర్ణయం కరెక్టే అని సంజయ్, దాసరి నారాయణ రావు వాళ్లు అనుకున్నారట.  కథ అనుకోగానే రాములమ్మ పాత్ర కోసం అందరూ తెలంగాణ బిడ్డ విజయశాంతి అయితేనే బాగుంటుందని అనుకున్నారట. ఆమెను కలసి కథ వినిపించగా విజయశాంతి ఆ కథ లో లీనమైపోయి భావోద్వేగానికి గురై ఏడ్చేశారట.
ఆ తర్వాత హీరో కృష్ణ, తెలంగాణ శకుంతల, అశోక్ కుమార్ వంటి తారాగణాన్ని సిద్ధం చేసుకుని మొత్తానికి సినిమా మొదలుపెట్టేశారు. 55 రోజుల షెడ్యుల్ తో షూటింగ్ ను ముగించేసారు. ఎక్కువ భాగం షూటింగ్ తిరుపతిలోని జరిగింది. 1997 మార్చ్ 7 న దాదాపు 200 కేంద్రాలలో రిలీజ్ అయిన ఈ చిత్రం అంచనాలకు మించి రికార్డులను సృష్టించింది. అప్పట్లో తెలంగాణలో జరుగుతున్న పరిణామాలకు దగ్గరగా ఉండటంతో ప్రజలు బాగా కనెక్ట్ అయ్యారు. అప్పట్లో ఆడవారు సినిమా హాల్ లకు పెద్దగా వచ్చే వారు కాదు. కానీ ఒసేయ్ రాములమ్మ సినిమా చూడడం కోసం మహిళలు కూడా తండోపతండాలుగా సినిమా హాల్ వద్దకు చేరుకున్నారు అంటే ఒసేయ్ రాములమ్మ చిత్రం వారిని ఎంత ప్రభావితం చేసిందో అర్థమవుతుంది. ఆ తర్వాత ఒసేయ్ రాములమ్మ లాంటి చిత్రం ఇప్పటివరకు ఇంకొకటి రాలేదనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: