చిక్కుల్లో పడ్డ తమిళ స్టార్ కమెడియన్

Deekshitha Reddy
తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు చిక్కుల్లో పడ్డారు. ఇటీవల ఆయన చేసిన మండేలా అనే సినిమా వల్ల యోగిబాబుకి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆయనపై ఏకంగా చెన్నైలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు కొంతమంది. మండేలా సినిమా ఆపేయాలని కంప్లయింట్ చేశారు. సినిమా ద్వారా తమ వృత్తిని కించపరిచారని అన్నారు.
మండేలా గొడవ..
హాస్య నటుడి నుంచి కథానాయకుడు స్థాయికి ఎదిగిన నటుడు యోగిబాబు. నయనతారతో చేసిన కోకో కోకిల సినిమాతో తెలుగులో కూడా బాగా పాపులర్ అయ్యాడు యోగిబాబు. ఇటీవల వరుసగా మెయిన్ లీడ్ గా సినిమాలు చేస్తున్నాడు, దానితోపాటు కమెడియన్ గా కూడా కెరీర్ కొనసాగిస్తున్నాడు. ఇటీవల మండేలా అనే సినిమాలో నటించాడు యోగిబాబు. ఇందులో ఆయన నాయీ బ్రాహ్మణుడిగా, సెలూన్ నడిపే వ్యక్తిగా నటించాడు. అయితే ఔట్ అండ్ ఔట్ కామెడీతో సాగే ఈ సినిమాలో కొన్ని చోట్ల నాయీ బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలున్నాయనేది ప్రధాన ఆరోపణ. తమ వృత్తని తక్కువ చేసి చూపించారని, యోగిబాబుతో అర్థంపర్థంలేని కామెడీ చేయించారని, తమను కించపరిచారని, తమిళనాడు నాయీ బ్రాహ్మణ కార్మికుల సంక్షేమ సంఘం నాయకులు ఆరోపించారు. నిర్వాహకులు శుక్రవారం చెన్నై పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
మండేలా చిత్రంలో నాయీ బ్రాహ్మణ కార్మికులను కించపరిచే విధంగా పలు సన్నివేశాలు చోటుచేసుకున్నాయని, అదేవిధంగా వైద్య సామాజిక వర్గానికి చెందిన 40 లక్షల మంది మనోభావాలకు భంగం కలిగే విధంగా సన్నివేశాలు ఉన్నాయని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. మండేలా చిత్ర దర్శక నిర్మాతలు అందులో నటించిన యోగిబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దీంతో యోగిబాబు కొత్త సినిమా వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. స్టెప్ బై స్టెప్ కామెడీ హీరోగా ఎదుగుతూ తమిళ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యోగిబాబు మండేలా సినిమాతో ఇలా ఇబ్బందుల్లో పడ్డాడు.
నాయీ బ్రాహ్మణులతో చర్చలు..
మరోవైపు చిత్ర బృందం నాయీ బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పింది. వారిని కించపరిచే సన్నివేశాలు లేవని, ఎవరినీ కించపరిచే ఉద్దేశం తమకు లేదని వివరణ ఇచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: