అతడు సినిమాలో అనాథ పాత్రలో జీవించేసిన మహేష్ బాబు..!

Kothuru Ram Kumar

ఆగస్టు 10, 2005 వ తేదీన విడుదలైన అతడు సినిమాలో మహేష్ బాబు, సోను సూద్, త్రిష, షియాజీ షిండే, కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగులు అందించడంతో పాటు దర్శకత్వం కూడా తానే వహించారు. అట్టర్ ప్లాప్ సినిమాలతో తీవ్ర నిరాశలో ఉన్న మహేష్ బాబు ని అతడు సినిమా మళ్ళీ సక్సెస్ ఫుల్ హీరోగా నిలబెట్టిందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా తెలుగు పరిశ్రమలో అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి బాక్సాఫీస్ వద్ద చాలా కోట్ల రూపాయలను సంపాదించిపెట్టింది. అప్పట్లో తెలుగు పరిశ్రమలో ఏ సినిమా వసూల్ చేయని డబ్బులను అతడు సినిమా వసూలు చేసి రికార్డులను తిరగరాసింది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు నందు అనే ఒక అనాధ వ్యక్తి పాత్రలో నటించాడు. 


ఈ సినిమా కథ గురించి తెలుసుకుంటే... నంద గోపాల్(నందు) అనే ఒక అనాథ పెద్ద ప్రొఫెషనల్ కిల్లర్ గా మారుతాడు. అతనికి భాగస్వామి అయిన మల్లి(సోను సూద్) కూడా డబ్బులిస్తే ఎవరినైనా చంపుతుంటాడు. అయితే జనతా పార్టీ నిర్వహించే సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి శివారెడ్డి(షియాజీ షిండే) పై హత్యాయత్నం జరిగేలా... ప్రజల్లో సానుభూతి పొందేలా ఒక మర్డర్ అటెంప్ట్ చేయాలని నందు కి ఒక కోటిన్నర రూపాయలు ఇస్తాడు బాజీ రెడ్డి(కోట శ్రీనివాసరావు). దీంతో నందు ముఖ్యమంత్రి శివారెడ్డి పై హత్యాయత్నం చేయడానికి వెళ్తాడు కానీ శివారెడ్డి ని వేరే ఎవరో గన్ తో షూట్ చేసి చంపేస్తారు. దీంతో గన్ను పట్టుకుని అక్కడికి వెళ్ళిన నందుని పోలీసులు వెంబడిస్తారు. ఈ క్రమంలోనే నందు ఒక తాడు సహాయంతో భవనంపై నుంచి ట్రైన్ పై దూకి తప్పించుకుంటాడు. ఆ తర్వాత నందు ట్రైన్ లోపలికి వెళ్లి పార్థసారధి( రాజీవ్ కనకాల) అనే ఒక ప్రయాణికుడి ఎదుట కూర్చుంటాడు. అయితే నందు ని పట్టుకోవడం కోసం పోలీసులు నెక్స్ట్ రైల్వేస్టేషన్ లో వెయిట్ చేస్తుంటారు. 


ఈ క్రమంలోనే పార్థసారథి(పార్థు) నందుతో ముచ్చట పెడుతుంటాడు. చిన్నప్పుడు తన తాత సూర్యనారాయణ మూర్తి (నాజర్) తిట్టాడన్న కోపంతో ఇల్లు వదిలి పారిపోయి గుజరాత్ రాష్ట్రంలో ఒక కాంట్రాక్టరు వద్ద ఇంతకాలం పనిచేశానని పార్ధు నందు కి చెబుతాడు. కానీ ఇప్పుడు తమ కుటుంబ సభ్యులను బాధ పెట్టలేక తిరిగి తన సొంత ఊరైన బాశర్లపూడికి బయలుదేరానని పార్థు నందు కి చెప్తాడు. వాళ్ళిదరూ ప్రయాణిస్తున్న నర్సాపూర్ ఎక్స్ప్రెస్స్ గుడివాడ స్టేషన్ లో 20 నిమిషాలపాటు ఆగుతుంది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నందు ని చంపడానికి కాల్పులు జరుపుతుంటారు. దురదృష్టవశాత్తు ఈ కాల్పుల్లో  పార్థు తలకి ఒక బుల్లెట్ తగిలి చనిపోతాడు. దీంతో పోలీసుల నుండి తప్పించుకొని పార్థుగా బాశర్లపూడిలో ఉన్న సూర్యనారాయణ మూర్తి ఇంటికి వెళ్తాడు నందు. ముఖ్యమంత్రి ని చంపిన నేరం నుంచి తప్పించుకోవడానికి తనే పార్థునని అబద్ధమాడుతాడు నందు. అనాధగా పెరిగి పెద్దయిన నందు కి పార్థ ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని బంధాల విలువలు తెలుస్తాయి. ఇకపోతే అనాధ గా మహేష్ బాబు అద్భుతంగా నటించాడు అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: