హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ రెండు కలిస్తే...వైసీపీ ఎమ్మెల్యేకు బొమ్మే..

గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చి, తెలుగుదేశం పార్టీకి అనేక నియోజకవర్గాల్లో డ్యామేజ్ చేసిన విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో జనసేనకు వైసీపీకి వచ్చిన మెజారిటీలు కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అంటే టి‌డి‌పి-జనసేనలు కలిసి పోటీ చేసి ఉంటే అలాంటి నియోజకవర్గాల్లో వైసీపీకి చెక్ పడిపోయేది. అలా టి‌డి‌పి-జనసేనలు కలిసి ఉంటే వైసీపీ నష్టపోయే నియోజకవర్గాల్లో ముమ్మిడివరం ఒకటి.
గత ఎన్నికల్లో వైసీపీ తరుపున పొన్నాడ సతీశ్ పోటీ చేయగా, టి‌డి‌పి నుంచి దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు), జనసేన నుంచి పితాని బాలకృష్ణలు పోటీ చేశారు. అయితే హోరాహోరీ పోరులో బుచ్చిబాబుపై సతీశ్  5 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఇక్కడ పితానికి 33 వేల ఓట్లు పడ్డాయి. అంటే జనసేన-టి‌డి‌పిలు కలిసి బరిలో ఉంటే పొన్నాడకు ఓటమి ఎదురయ్యేదనే చెప్పొచ్చు.
అయితే ఇప్పుడు ఎమ్మెల్యేగా పొన్నాడ పర్వాలేదనిపించేలా పనిచేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండటంలో గానీ, వారి సమస్యలని పరిష్కరించడంలో పొన్నాడ ముందే ఉంటున్నారు. అటు ముమ్మిడివరంలో కొత్తగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, జగనన్న కాలనీల పేరిట పేదలకు ఇళ్ళు నిర్మించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. నాడు-నేడు ద్వారా ముమ్మిడివరంలో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాయి. అయితే నియోజకవర్గంలో రోడ్ల పరిస్తితి మరీ దారుణంగా ఉంది. వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి...వాటిని బాగుచేసే కార్యక్రమం వైసీపీ చేయడం లేదు.
ముమ్మిడివరం నగర పంచాయితీలో డంపింగ్ యార్డ్ సమస్య తీవ్రంగా ఉంది. ఇక ఇక్కడ శివారు గ్రామాలకు తాగునీటి సరిగ్గా అందటం లేదు. ఇక్కడ బస్ కాంప్లెక్స్ శిథిలమైంది. దీని వల్ల ప్రయాణికులు రోడ్లపైనే నిలబడి బస్సుల కోసం ఎదురుచూసే పరిస్తితి ఉంది. ఈ సమస్యలని పరిష్కరించాలసిన బాధ్యత వైసీపీ ఎమ్మెల్యేదే. అటు టి‌డి‌పి తరుపున బుచ్చిబాబు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉండగా ముమ్మిడివరంలో బుచ్చిబాబు మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు వైసీపీ హయాంలో అభివృద్ధి అంతంత మాత్రమే. దీంతో ప్రజలు ఇప్పుడు బుచ్చిబాబు వైపు చూస్తున్నారు. ఇక్కడ జనసేన బలం పెరగలేదు. వచ్చే ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేనలు కలిసి బరిలో ఉంటే పొన్నాడకు గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: