హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అనంతలో దూసుకెళుతున్న అనంత...నెక్స్ట్ తిరుగులేదా?

అనంతపురం జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని అందరికీ తెలిసిందే. ఈ జిల్లాలో టి‌డి‌పికి తిరుగులేని బలం ఉంది...ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడ టి‌డి‌పికి మంచి ఫలితాలే వచ్చేవి. అంతలా టి‌డి‌పికి అనంత జిల్లా కలిసొస్తుంది. కాకపోతే అనంతపురం జిల్లాలో టి‌డి‌పికి అసలు కలిసిరాని నియోజకవర్గం కూడా ఒకటి ఉంది. అదే అనంతపురం అసెంబ్లీ స్థానం...ఈ స్థానంలో టి‌డి‌పికి పెద్ద విజయాలు దక్కలేదు.
ఏదో 1989లో ఒకసారి ఇక్కడ టి‌డి‌పి గెలవగా, రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో మరొకసారి టి‌డి‌పి విజయం సాధించింది. ఇక 2019 ఎన్నికల్లో టి‌డి‌పికి మరొకసారి ఓటమి ఎదురైంది. వైసీపీ తరుపున అనంత వెంకట్రామి రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈయన గతంలో నాలుగుసార్లు కాంగ్రెస్ తరుపున అనంతపురం ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత వైసీపీలోకి వచ్చేసి...2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
కానీ 2019 ఎన్నికల్లో అనంత రూట్ మార్చి, అనంతపురం అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఎమ్మెల్యేగా అనంత ప్రజలకు ఎప్పుడు అండగానే ఉంటున్నారు. ఈ రెండేళ్లలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తున్నారు. అలాగే అనంత నియోజకవర్గంలో ఉన్న డ్రైనేజ్ సమస్యకు చెక్ పెట్టారు. అటు నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు పాతూరులోని పాత పోస్టాఫీస్ నుండి తడకలేరు వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నాడు-నేడు అనంతలో విజయవంతంగా జరుగుతుంది. ఆ కార్యక్రమం వల్ల ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాయి.
అనంత నియోజకవర్గంలో కొత్తగా గ్రామ/వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్‌లు, రైతు బజార్లు, వాటర్ ట్యాంకులు, సి‌సి రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. అటు జగనన్న కాలనీల పేరిట అనంతలో పేదలకు ఇళ్ళు కట్టించే కార్యక్రమం జరుగుతుంది. ఇక కరోనా సమయంలో కూడా అనంత ప్రజలకు అండగా నిలబడుటూ వచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలకు వెళుతూ అధికారులని యాక్టివ్ చేస్తూ, ప్రజలకు త్వరగా పనులయ్యేలా చేస్తున్నారు.
ఇలా అనంతలో అనంత దూసుకెళుతున్నారు. అటు టి‌డి‌పి తరుపున ప్రభాకర్ చౌదరీ పనిచేస్తున్నారు. ఈయన కూడా దూకుడుగానే పనిచేస్తున్నారు. ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో అనంతకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. మరి అనంతలో బలంగా ఉన్న అనంతకు చెక్ పెట్టడం ప్రభాకర్ వల్ల అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: