హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వాసుపల్లికి అదే ప్లస్...!

గత ఎన్నికల్లో టిడిపి తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ వైపుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక అలా వైసీపీలోకి వెళ్లిన వారిలో వాసుపల్లి గణేష్ కూడా ఒకరు. గణేష్ టిడిపి తరఫున 2009 ఎన్నికల్లో విశాఖ సౌత్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో అదే సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి టిడిపి తరఫున విజయం సాధించారు. ఐదేళ్ల పాటు టిడిపి ఎమ్మెల్యేగా సౌత్‌లో మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అలాగే పార్టీ బలోపేతానికి కృషి చేశారు.
ఇక 2019 ఎన్నికల్లో జగన్ గాలిలో కూడా విశాఖ సౌత్ లో గణేశ్ మరోసారి విజయం సాధించారు. కానీ రోజురోజుకూ టిడిపి వీక్ కావడం, అటు విశాఖను రాజధానిగా టిడిపి వ్యతిరేకించడం... ఈ పరిణామాల నేపథ్యంలో వాసుపల్లి గణేష్ టిడిపిని వీడి వైసీపీ వైపుకు వచ్చారు. ఇక వైసీపీ లోకి వచ్చిన దగ్గర నుంచి వాసుపల్లి దూకుడుగా సౌత్ నియోజకవర్గం లో పని చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అధికార పార్టీలో ఉండడంతో అనుకున్న విధంగా పనులు చేయగలుగుతున్నారు.
ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యేకు ప్లస్ అవుతున్నాయి. అయితే కేవలం అధికార వైసిపి బలమే నమ్ముకోకుండా, తన సొంత బలం కూడా నమ్ముకొని వాసుపల్లి గణేష్ నియోజవర్గంలో పనిచేస్తున్నారు. ఎక్కడకక్కడ ప్రజలకి అండగా నిలుస్తూ, తన సొంత డబ్బు సైతం ఖర్చు పెడుతూ ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. సమస్య ఉన్నచోటకు వెళ్తూ, ఆ సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తున్నారు. ఇలా వాసుపల్లి నిత్యం ప్రజల్లో ఉంటూ తన సొంత బలం ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అటు టిడిపి తరఫున సౌత్‌లో నాయకుడు ఎవరు లేరు. ఇప్పుడు ఇదే వాసుపల్లికి పెద్ద అడ్వాంటేజ్ అయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో వాసుపల్లికి సౌత్ నుంచి పోటీ చేసి మళ్ళీ గెలవడం అంత కష్టం కాదనే చెప్పాలి. అయితే టిడిపి తరుపున బలమైన నాయకుడు నిలబడితే అప్పుడు వాసుపల్లికి గట్టిపోటీ వస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాసుపల్లికి సొంత ఇమేజ్ బాగా ప్లస్ అవుతుంది. కాబట్టి ఇప్పట్లో సౌత్‌లో వాసుపల్లికి పెద్ద ఇబ్బంది లేదని చెప్పొచ్చు.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: