హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: తిప్పేస్వామికి టీడీపీ మళ్ళీ ఛాన్స్ ఇవ్వదా?

అనంతపురం జిల్లా అంటే మొదట నుంచి తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన జిల్లా అనే సంగతి తెలిసిందే. అయితే ఆ జిల్లాలో టీడీపీకి కాస్త అనుకూలంగా లేని నియోజకవర్గం ఏదైనా ఉందటే అది మడకశిరనే. మొదట నుంచి ఇక్కడ టీడీపీ సత్తా చాటలేకపోతుంది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి మడకశిరలో టీడీపీ గెలిచింది... కేవలం మూడు సార్లు మాత్రమే.
1985, 1994, 2014 ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ టీడీపీ గెలిచింది. అయితే 2014లో టీడీపీ తరుపున ఈరన్న గెలిచారు. కానీ 2018లో ఆయన తప్పుడు అఫడవిట్ ఇచ్చారని చెప్పి, సుప్రీం కోర్టు ఈరన్నపై అనర్హత వేటు వేసింది. దీంతో 2014లో వైసీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయి, రెండోస్థానంలో నిలిచిన తిప్పేస్వామి ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకారం చేశారు.
ఇక 2019 ఎన్నికలోచ్చేసరికి మడకశిరలో వైసీపీ విజయం సాధించింది. ఈరన్నపై తిప్పేస్వామి ఘనవిజయం సాధించారు. ఎమ్మెల్యేగా తనదైన శైలిలో తిప్పేస్వామి పనిచేసుకుంటూ వెళుతున్నారు. పెద్దగా వివాదాలు జోలికి వెళ్లకుండా తిప్పేస్వామి నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇక ప్రభుత్వం తరుపున జరిగే ప్రతి కార్యక్రమం మడకశిరలో జరుగుతుంది.

అంతే గానీ ఇక్కడ కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు ఏమి జరగడం లేదు. అసలు ఏ ప్రభుత్వం వచ్చిన మడకశిరలో తాగునీటి సమస్యలు తగ్గడం లేదు. ముఖ్యంగా మడకశిర మున్సిపాలిటీలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉండగా, డ్రైనేజ్ సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. డ్రైనేజ్ ఇబ్బందులకు తోడు పందులు ఆయా వీధుల్లో స్వైర విహారం చేస్తున్నాయి. అటు కాలువల్లో ప్లాస్టిక్‌ కవర్లు, చెత్తచెదారం నిండుకుపోయి, మురుగునీరు నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతోంది.
రాజకీయంగా చూసుకుంటే జగన్ ఇమేజ్‌తో తిప్పేస్వామి బాగానే బండి లాగిస్తున్నారు. కానీ ఇక్కడ టీడీపీ నేత ఈరన్న కూడా దూకుడుగా ఉంటున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో తిప్పేస్వామికి చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈరన్న ముందుకెళుతున్నారు. టీడీపీ క్యాడర్ కూడా దూకుడుగా ఉండటంతో నెక్స్ట్ ఎన్నికల్లో తిప్పేస్వామి గెలుపు అంత సులువు కాదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: