హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: కిరణ్.. టీడీపీకి ‘కళా’ తప్పేలా చేస్తున్నారా?

అది మొదట నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అక్కడ మరో పార్టీ గెలిచిన సందర్భాలు చాలా తక్కువ. కానీ ఇప్పుడు పరిస్తితి మారిపోయింది. ఒక్కసారి గెలిచిన వైసీపీ, అక్కడ టీడీపీకి కళ తప్పేలా చేస్తుందని చెప్పొచ్చు. అలా టీడీపీ పట్టు కోల్పోతున్న నియోజకవర్గాల్లో ఎచ్చెర్ల ఒకటి. ముందు నుంచి ఇక్కడ టీడీపీకే లీడింగ్ ఎక్కువ. టీడీపీ పెట్టాక జరిగిన ఎన్నికల్లో 6 సార్లు ఎచ్చెర్లలో పసుపు జెండా ఎగిరింది. మధ్యలో కాంగ్రెస్ 2004, 2009 ఎన్నికల్లో గెలిచింది.
2014లో ఎచ్చెర్ల నుంచి కిమిడి కళా వెంకట్రావు విజయం సాధించగా, ఆయన చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా, ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా పనిచేశారు. 2019 ఎన్నికలోచ్చేసరికి సీన్ ఒక్కసారిగా మారుతూ, ఇక్కడ వైసీపీ తరుపున గోర్లే కిరణ్ కుమార్ విజయం సాధించి, ఎమ్మెల్యేగా దూసుకెళుతూ, కళా వెంకట్రావుకు ఏ మాత్రం పుంజుకునే ఛాన్స్ ఇవ్వడం లేదు. పైగా కళా వెంకట్రావు ఏపీ టీడీపీ అధ్యక్షుడి పదవి కూడా పోవడం, వయసు మీద పడటంతో, నియోజకవర్గంలో యాక్టివ్‌గా పనిచేయలేకపోవడం వల్ల, ఎచ్చెర్లలో టీడీపీ పుంజుకోలేకపోతుంది.
అటు జగన్ ప్రభుత్వం పథకాలు కిరణ్‌కు ప్లస్ అవుతుండగా, తాను నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం మరింత అడ్వాంటేజ్ అవుతుంది. అలాగే ప్రభుత్వం ద్వారా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, సిమెంట్ రోడ్ల నిర్మాణాలు, నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలు అభివృద్ధి చెందడం, జగనన్న కాలనీల ద్వారా పేదలకు ఇళ్ళు కట్టించే కార్యక్రమం, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎచ్చెర్లలో జరుగుతున్నాయి.
అయితే ఎచ్చెర్లలో పలు సమస్యలు ఉండటం ఎమ్మెల్యేకు మైనస్ అవుతుంది. ఈ నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్య అధికంగా ఉండగా, దాని వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో సరైన రహదారుల సౌకర్యం లేకపోవడం, నీటి సమస్య తీవ్రంగా ఉండటం, వలసలు కూడా అధికంగా ఉండటం వైసీపీ ఎమ్మెల్యేకు ఇబ్బంది అవుతుంది. ఇంకా అనేక సమస్యలు నియోజకవర్గంలో ఉన్నాయి. కానీ రాజకీయంగా మాత్రం కిరణ్ బలంగా ఉండటం వల్ల, కళా వెంకట్రావుకు పుంజుకునే ఛాన్స్ రావడం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: