హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అప్పలనాయుడు ఆధిక్యం తగ్గిందా?

గత ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసి, 9కి 9 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. అన్నిచోట్ల వైసీపీ మంచి మెజారిటీలతో గెలిచింది. అలా వైసీపీ తరుపున మంచి మెజారిటీతో గెలిచినవారిలో బద్దుకొండ అప్పలనాయుడు కూడా ఒకరు. మంత్రి బొత్స సత్యనారాయణ బంధువైన అప్పలనాయుడు 2009 ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసి స్వల్ప మెజారిటీ తేడాతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.
ఇక 2014 ఎన్నికలోచ్చేసరికి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితి మరీ ఘోరంగా తయారైన విషయం తెలిసిందే. అయినా సరే అప్పలనాయుడు బొత్సతో పాటే కాంగ్రెస్‌లో కొనసాగి, ఆ ఎన్నికల్లో మళ్ళీ నెల్లిమర్లలో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఇక తర్వాత బొత్సతో పాటు అప్పలనాయుడు కూడా కాంగ్రెస్‌ని వీడి వైసీపీలోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో అప్పలనాయుడు వైసీపీ తరుపున నెల్లిమర్ల బరిలో నిలబడి భారీ మెజారిటీతో గెలిచారు.
భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచిన అప్పలనాయుడు నియోజకవర్గంలో బాగానే పనిచేసుకుంటున్నారు. స్థానిక సమస్యలని పరిష్కరించడంలో ముందున్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చేస్తున్నారు. అలాగే నెల్లిమర్లలో కొత్తగా రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నాడు-నేడు ద్వారా నెల్లిమర్లలో ప్రభుత్వ పాఠశాలలకు కొత్త రంగులు వచ్చాయి. అలాగే వర్షాలకు దెబ్బతిన్న రోడ్లని బాగుచేసే కార్యక్రమాలు చేస్తున్నారు. కరోనా సమయంలో అప్పలనాయుడు ప్రజలకు అండగా నిలబడ్డారు.
అయితే నెల్లిమర్ల నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా డెంకాడ మండలంలో తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే డ్రైనేజ్ సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. తోటపల్లి, రామతీర్ధ సాగర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండితే నెల్లిమర్ల మండలంలో సాగునీటి సమస్యలు ఉండవు. పూసపాటిరేగ మండలంలో జల కాలుష్యం వల్ల కిడ్నీ వ్యాధులు, పచ్చ కామెర్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
రాజకీయంగా చూసుకుంటే నెల్లిమర్లలో అప్పలనాయుడు ఆధిక్యం ఎక్కడా తగ్గలేదు. అదే సమయంలో ఇక్కడ టీడీపీ నేత పతివాడ నారాయణస్వామి పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు. దీంతో నెల్లిమర్లలో  టీడీపీ వీక్‌గా కనిపిస్తోంది. అదే అప్పలనాయుడుకు ప్లస్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: