హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: కంచుకోటలో తేలిపోయిన ఎమ్మెల్యే...వైసీపీకి ఛాన్స్ వచ్చినట్లే...!

శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాలు ఎక్కువగానే ఉన్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ హవా ఉన్నా సరే అలాంటి నియోజకవర్గాల్లో టీడీపీ అధిక్యమే నడుస్తోంది. అలా గత ఎన్నికల్లో జగన్ వేవ్ ఉన్నా సరే టీడీపీ గెలిచిన నియోజకవర్గం ఇచ్చాపురం. టీడీపీ ఆవిర్భవించాక ఇక్కడ ఆ పార్టీ కేవలం ఒకే ఒకసారి మాత్రమే ఓటమి పాలైంది.
1983 నుంచి 2019 వరకు 9 సార్లు ఎన్నికలు జరిగితే 8 సార్లు టీడీపీనే గెలిచింది. కేవలం 2004లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఇక గత రెండు పర్యాయాల నుంచి ఇచ్చాపురంలో టీడీపీ తరుపున బెందాలం అశోక్ గెలుస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండటంతో దూకుడుగా పనిచేయడం లేదు. అలాగే ప్రజలకు పెద్దగా అందుబాటులో కూడా ఉండటం లేదని తెలిసింది.
ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో పార్టీకి మంచి ఫలితాలు రాలేదు. వైసీపీ హవా నడిచింది. అటు ఇచ్చాపురం మున్సిపాలిటీలో వైసీపీ సత్తా చాటింది. 23 వార్డుల్లో వైసీపీ 15 గెలిస్తే, టీడీపీ 6, ఇతరులు 2 గెలుచుకున్నారు. ఈ పరిస్తితి చూస్తుంటే ఇచ్చాపురంలో వైసీపీకి లీడ్ వచ్చినట్లు కనబడుతుంది. ఇక్కడ వైసీపీ తరుపున ప్రియా సిరాజ్ పనిచేస్తున్నారు. ఈయన 2009లో ఇచ్చాపురం నుంచే టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత వైసీపీలోకి వచ్చేశారు. 2019లో వైసీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు.
అయితే పార్టీ అధికారంలో ఉండటంతో సిరాజ్ దూకుడుగా పనిచేస్తున్నారు. పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పథకాలు సిరాజ్‌కు ప్లస్ అవుతున్నాయి. చాలావరకు వైసీపీని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. రెండేళ్లలో ఇక్కడ వైసీపీకి బలం పెరిగింది. ఇదే ఊపు కొనసాగిస్తే నెక్స్ట్ ఎన్నికల్లో ఇచ్చాపురం సీటు వైసీపీ వశమయ్యే ఛాన్స్ ఉంది. చూడాలి మరి టీడీపీ కంచుకోటని వైసీపీ కైవసం చేసుకుంటుందో లేక మళ్ళీ టీడీపీకే ఛాన్స్ ఇచ్చేస్తుందో?  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: