హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వాసుపల్లికి సొంత ఇమేజ్ ఉందా?

2019 ఎన్నికల్లో జగన్ వేవ్ ఎలా వచ్చిందో చెప్పాల్సిన పనిలేదు. జగన్ వేవ్‌లో టీడీపీలో ఉన్న బడా బడా నేతలు ఓటమి పాలయ్యారు. జగన్ ఇమేజ్‌తో 151 ఎమ్మెల్యేలు గెలిచారు. ఇంతటి జగన్ గాలిలో కూడా టీడీపీ తరుపున 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇలా 23 మంది గెలవగలిగారు అంటే, పార్టీ బలంతో పాటు సొంత ఇమేజ్ ఉండటం వల్లే అని చెప్పొచ్చు. అలా సొంత బలంతో వైసీపీ మీద గెలిచిన ఎమ్మెల్యేల్లో విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కూడా ఒకరు.
2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి, గణేష్ దారుణంగా ఓడిపోయి, మూడోస్థానానికి పరిమితమయ్యారు. ఆ ఓటమి నుంచి గణేష్ తిరుగులేని నేతగా ఎదుగుతూ వచ్చి వరుస విజయాలు అందుకున్నారు. 2014లో మాత్రం భారీ మెజారిటీతో గెలిచిన వాసుపల్లి, ఐదేళ్లు విశాఖ సౌత్ అభివృద్ధి కోసం కృషి చేశారు. సొంతంగా బలం పెంచుకున్నారు. ఆ బలంతోనే 2019 ఎన్నికలో వాసుపల్లి టీడీపీ నుంచి గెలవగలిగారు.
ఇక ఏడాది పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కొనసాగిన గణేశ్..మొన్న ఆ మధ్య టీడీపీని వీడి వైసీపీ ప్రభుత్వానికి మద్ధతు తెలిపారు. పదవికి రాజీనామా చేయకుండా, వైసీపీలో చేరకుండా, జగన్‌కు సపోర్ట్ ఇచ్చారు. అంటే ఇక నుంచి వాసుపల్లి అనధికారికంగా వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగనున్నారు. అలాగే నియోజకవర్గానికి నిధులు కూడా వచ్చే అవకాశముంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానుండటం వల్ల నియోజకవర్గం అభివృద్ధిలో నడవనుంది. అయితే గణేశ్ సొంత ఇమేజ్‌కు జగన్ ఇమేజ్ తోడు కానుండటంతో, విశాఖ సౌత్‌లో వైసీపీకి తిరుగుండదనే చెప్పొచ్చు.
వాసుపల్లి టీడీపీని వీడటంతో, ఆ పార్టీ తరుపున నియోజకవర్గ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇక దక్షిణ నియోజకవర్గంలో పలు సమస్యలు కూడా ఉన్నాయి. విశాఖ దక్షిణ భాగాన నౌకాశ్రయం, హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్, ఇంకా విశాఖ ఉక్కు కర్మాగారం వంటి భారీ ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్రీకరించి ఉండటం వలన ఈ ప్రాంతంలో శబ్ద, వాయు, జల కాలుష్యంతో నిండిపోయింది.
అయితే అభివృద్ధి ఎక్కువగా ఉత్తరం వైపే ఉండటంతో, దక్షిణ ప్రాంతం ఇంకా పాత పట్టణంగానే ఉంది. ఇరుకైన రోడ్లు, రోడ్లమీదనే ప్రవహించే మురుగు కాలువల వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సముద్రం ఒడ్డునే ఉన్న పలు ప్రైవేట్ సంస్థలు, ఫార్మా, ఆక్వా సంస్థలు పరిశ్రమల కాలుష్యాలను నేరుగా సముద్రంలోనే విడుదల చేస్తున్నాయి. దీని వల్ల సముద్ర సంబంధిత ఆహారం తీసుకునే ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: