హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పవన్ ప్రత్యర్ధి దూకుడు తగ్గిందా?

2019 ఎన్నికల్లో ఏపీ ప్రజల దృష్టిని బాగా ఆకర్షించిన నియోజకవర్గాల్లో గాజువాక కూడా ఒకటి. తొలిసారి పవన్ కల్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేయడంతో, ఆయన గెలుస్తారా లేదా? అని అంతా ఆతృతగా ఎదురుచూశారు. కానీ ఊహించని విధంగా జనసేనాని వైసీపీ నేత చేతిలో చిత్తుగా ఓడిపోయారు. జగన్ వేవ్ ముందు పవన్ నిలబడలేకపోయారు. వైసీపీ నుంచి తిప్పల నాగిరెడ్డి విజయం సాధించారు.
పవన్ మీద గెలవడంతో నాగిరెడ్డిపై ఎక్కువ అంచనాలు ఉన్నాయి. కానీ నియోకవర్గంలో నాగిరెడ్డి పెద్ద యాక్టివ్ గా లేరని తెలుస్తోంది. ఎక్కువ పనులని ఆయన తనయుడు దేవన్ రెడ్డి చూసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యేకు అడ్వాంటేజ్‌గా ఉన్నాయి. నియోజకవర్గంలో కొత్తగా గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ హెల్త్ కేర్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలు, సి‌సి రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక వైసీపీలో గ్రూపు రాజకీయాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సీటు దక్కించుకోవాలని నాగిరెడ్డి దగ్గర బంధువు తిప్పల గురుమూర్తి రెడ్డి ప్రయత్నిస్తున్నారట.
ఇక గాజువాకలో పవన్ గాజువాక మీద పెద్దగా దృష్టి పెట్టడం లేదు. అటు టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు కూడా మూడు రాజధానుల దెబ్బకు సైలెంట్ అయిపోయారు. ఆయన టీడీపీని వీడే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. కాకపోతే టీడీపీ-జనసేన గనుక కలిసి పోటీ చేస్తే వైసీపీకి చెక్ పెట్టడం సులువు అవుతుంది.
నియోజకవర్గంలో పలు సమస్యలు కూడా ఉన్నాయి. గాజువాకలో అనేక వ్యాపార, పరిశ్రమ, అనుబంధ సంస్థలు ఉన్నందువలన పరిశ్రమల నుండి, ముఖ్యంగా ఓడ రేవుల నుంచి, అధిక కాలుష్యం వెలువడుతుంది. వాతావరణ కాలుష్యం ఇక్కడి ప్రజలను అనేకరకాల వ్యాధులకు గురిచేస్తున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇక్కడ మౌలిక వసతుల కల్పన జరగడం లేదు. వాహనాల రద్దీ పెరగడంతో కాలుష్యం పెరిగింది. ఇరుకైన రోడ్లు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వేసవిలో తాగునీటి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: