హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యే రెండు మండలాలకే పరిమితమా?

2019 ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలో భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేల్లో పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) ఒకరు. అయితే వాసుబాబు 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి గన్ని వీరాంజనేయులు చేతిలో 9 వేల మెజారిటీ తేడాతో ఓడిపోయారు. ఓటమి ఎదురైన నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. అందుకే 2019 ఎన్నికల్లో గన్నిపై దాదాపు 33 వేలపైనే మెజారిటీతో గెలిచారు.

 

భారీ మెజారిటీతో గెలిచిన వాసుబాబు...ఏడాది కాలంలో నియోజకవర్గంలో ప్రభావం ఏమి చూపలేకపోయారు. ఏడాది కాలంలో పెద్దగా సంచలనాలు సృష్టించింది లేదు. అలా అని పెద్దగా చేసింది ఏమి లేదు. ఇక పుప్పాల ఏలూరు పార్లమెంటరీ అధ్యక్షుడుగా పనిచేస్తున్నారు. అయితే అధ్యక్షుడుగా ఉన్నా సరే ఏలూరు పరిధిలో పెద్దగా పనిచేసిన సందర్భం లేదు. ఇక ఉంగుటూరులో ప్రభుత్వ పథకాలు బాగానే అందుతున్నాయి గానీ, అభివృద్ధి మాత్రం పెద్దగా జరగలేదు.

 

అయితే వాసుబాబు రెండు మండలాల ఎమ్మెల్యేగా ముద్రవేసుకున్నారని తెలుస్తోంది. నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉంటే పుప్పాల మాత్రం నిడమర్రు, గణపవరం మండలాలపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారని టాక్. ఎక్కువ ఈ రెండు మండలాల్లోనే పర్యటిస్తారు. భీమడోలు, ఉంగుటూరు మండలాలని పెద్దగా పట్టించుకోరట. ఇక టీడీపీలో గన్ని వీరాంజనేయులు యాక్టివ్‌గా ఉన్నారు.

 

ఓడిపోయిన దగ్గర నుంచి నియోజకవర్గంలోనే తిరుగుతూ, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అధినేత చంద్రబాబు ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చిన గన్ని యాక్టివ్‌గా చేస్తుంటారు. స్థానికంగా కూడా కార్యకర్తలని కలుపుకుంటూ పోతూ...పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళుతున్నారు. అధికార పార్టీ ప్రజావ్యతిరేక పాలనపై ఎప్పుడు పోరాడుతూనే ఉంటారు. నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో పర్యటిస్తూ కార్యకర్తలకు అండగా ఉంటున్నారు.

 

అటు స్థానిక సంస్థల ఎన్నికల విషయానికొస్తే వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీకే ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశముంది. కానీ వెస్ట్ గొదావరిలొ టీడీపీ బాగా బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఉంగుటూరు ఒకటి. చాలాచోట్ల వైసీపీకి టీడీపీ పోటీ ఇస్తుంది. గణపవరం, నిడమర్రు మండలాల్లో వైసీపీకి పట్టు ఉంటే, భీమడోలు, ఉంగుటూరు మండలాల్లో టీడీపీ స్ట్రాంగ్‌గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: