మార్నింగ్ రాగా : మేలు కొలుపు మేలు త‌ల‌పు

RATNA KISHORE
శ‌క్తి నిచ్చే రూపం..కొలువై ఉన్నాదిలే..మ‌నిషికి చైత‌న్యం ఇచ్చే రూపం వెంట ఉండేనులే..వింటున్నావా ఈ విధి కావ్యం..ఈ వీధి గీతం..ఆలాప‌న‌లో నేను మ‌రియు ఇంకొంద‌రు.. స్వ‌రానికి చేర్చు ప‌దం.. న‌యనానికి ప‌ర్వం.. హృద‌యానికి ప‌ర్వం.. ప‌ర్వ‌దిన వేళల్లో ప్ర‌వ‌ర్థ‌మానం.. ఆ  రూపాన్ని స్మ‌రిస్తే అనుప‌మానం.. ధ‌నుర్మాస వేళ‌ల్లో వ‌చ్చే మేలుకొలుపులు వింటూ నేను..ఈ మార్నింగ్ రాగా రాస్తూ నేను..వంద‌నాలు చెల్లిస్తున్నాను మా ఊరి భ‌జ‌న బృందాల‌కు.. ఏటా పిడికెడు బియ్యం అందించి గుప్పెడు ప్రేమ‌ను పొందేందుకు సిద్ధం నేను..నాతో పాటు ఇంకొంద‌రు.


మేలుకొలుపు మంచికి

మేలు త‌ల‌పు జీవితానికి

న‌డిపించే శ‌క్తి ఓ గొప్ప జీవితం

మ‌న‌లోనే మ‌న‌తోనే ఉంటే

ఆ వైష్ణ‌వ రూపం ఆ ప్రాగ్దిశ తేజం

ఆ శైవ సంప్ర‌దాయ రీతి

ఆ అభేద విధానం శ‌బ్ద‌భేరీ నాదం అన్నీఅన్నీ నాతోనే

మ‌రియు మీతోనే...


సంక్రాంతి వేళల్లో గోదాదేవీ గాథ వింటాం.. సంక్రాంతి వేళ‌ల్లో ధ‌నుర్మాస ఆగ‌మ‌న వేళ‌ల్లో ప‌రివ్యాప్తి చెందే సంకీర్త‌న‌ను నా శ్రీ‌కాకుళం దారుల్లో వింటాను. ప్ర‌జా ప్ర‌యోజ‌నం ఉండే క‌ళ‌ను ప్రేమించాలి అని చ‌దివేను..ఈ క‌ళ‌కు ప్ర‌యోజ‌నం పారిమార్థిక ధోర‌ణి రెండూ ఉన్నాయి.. వీరికి ఈ ఉద‌యం వేళ మా మార్నింగ్ రాగా త‌ర‌ఫున ఓ కృత‌జ్ఞ‌త ఓ ధ‌న్య‌వాద.


ప్ర‌తిరోజూ న‌గ‌ర సంకీర్త‌న చేయాలి.ధ‌నుర్మాస వేళ‌ల‌కో గొప్ప గుర్తింపు ఇవ్వాలి.మ‌నం విడిచిన భ‌జ‌న సంప్ర‌దాయ గీతాల‌కో కొన‌సాగింపు ఇవ్వాలి. ఇవ‌న్నీ ఆ కుటుంబాన్ని న‌డుపుతున్నాయి..ఆ కుటుంబాల‌ను న‌డుపుతున్నాయి.. బాక‌ర్ సాహేబ్ పేట (శ్రీ‌కాకుళం న‌గ‌రం) సొంగ‌ల కుటుంబంతో స‌హా ఇంకొన్ని కుటుంబాలు ధ‌నుర్మాస మేలుకొలుపుల‌కు ఏటా ముందుంటున్నాయి. 23 ఏళ్ల ఈ సంరంభంలో ఎన్నో మేలు కొలుపు ఎన్నో మేలిమి త‌ల‌పులు.


భీమేశ్వ‌ర భ‌జ‌న బృందం ఈ పేరు వింటే చాలు శ్రీ‌కాకుళం న‌గ‌రానికే మ‌కుటాయ‌మానం అయిన ఓ సంద‌ర్భం. మేలుకొలుపుల్లో ఏటా ముందుండే భ‌జ‌న బృందం..భ‌జ‌న,కీర్త‌న,ఆలాప‌న వీటితో పాటు కొన్ని మంచి ప‌నులు.రంగ‌స్థ‌లాన్ని ప్రేమించే కుటుంబాలు, ముఖానికి రంగు పులుముకుని నాట‌కాల‌ను ప్ర‌ద‌ర్శించే కుటుంబాలు, చెక్క ప‌నిచేసుకుంటూ క‌ళాకృతులు సృష్టించే కుటుంబాలు బాక‌ర్ సాహేబ్ పేట‌లో ఎన్నో!


ఉద‌యం ఇంటికి గణ‌ప‌తి గుడి ద‌గ్గ‌ర తార‌సిల్లిన బృందాలివి. కొన్నావీధి, జంగాల వీధితో పాటు మ‌రికొన్ని వీధుల‌లో భ‌జ‌న బృందాలు ఉన్నాయి.ఉద‌యం వేళ‌ల్లో ప‌ల‌క‌రించే ఈ బృందాల‌కు ప్ర‌జ‌ల నుంచి మంచి ఆద‌ర‌ణ ఉంది. సంక్రాంతి వేళ‌ల్లో వీరు అఖండ భ‌జ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించాక ఏటా ఐదు వేల మందికి అన్న‌దానం చేసి,స్వామి కార్యంలో ఓ బాధ్య‌త‌ను క్ర‌మం త‌ప్ప‌క నిర్వ‌ర్తిస్తారు.వీటితో పాటు రంగ స్థ‌ల క‌ళాకారులుగా ఉంటూ వివిధ ప్రాంతాల‌లో నాట‌క ప‌రిష‌త్ పోటీల‌కు సైతం వీళ్ల‌లో కొంద‌రు వెళ్తుంటారు. ఈ సంక్రాంతికి అంటే ఈ నెల 15 (శ‌నివారం) సాయంత్రం ఆరు గంట‌ల నుంచి ఈ నెల 16 (ఆదివారం) ఉద‌యం ఆరు గంట‌ల వ‌ర‌కు అఖండ భ‌జ‌న‌కు ఏటా మాదిరిగానే సిద్ధం అవుతున్నారు. ఈ కుటుంబాల‌తో పాటు బ‌ల‌గ శివ ప్ర‌సాద్,బ‌ల‌గ మ‌న్మ‌థరావు, లింగు బేరి హ‌రి, తామ‌రాప‌ల్లి శ్రీ‌నివాస‌రావు, బార‌క‌ల శ్రీ‌నివాస‌రావు, లింగుబేరి శ్రీ‌నివాస‌రావు, సొంగ‌ల ష‌ణ్ముఖ ఇంకా ఇంకొంద‌రు భీమేశ్వ‌ర ఆల‌యం (కొన్నావీధి) వ‌ద్ద నిర్వ‌హించేందుకు స‌న్న‌ద్ధం అవుతున్నారు. వీరికి సొంగల చిన్న గ‌ణేశ్ నేతృత్వం వ‌హిస్తున్నారు. ఏటా జ‌రిపే అన్న‌దాన క్ర‌తువును ఈ నెల 23న కొన్నావీధి భీమేశ్వ‌ర ఆల‌యం వ‌ద్ద మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి నిర్వ‌హించ‌నున్నారు. 23 వ‌సంతాలుగా కొన‌సాగుతున్న ఈ క్ర‌తువుకు దాత‌లెంద‌రో! ఆ పిడికెడు ప్ర‌సాదం అందించి గుప్పెడు ప్రేమ పంచే భ‌క్తులెంద‌రో! ధ‌నుర్మాస సంప్ర‌దాయాల‌కు కొనసాగింపున‌కు ప్రేర‌కులలెంద‌రో! వారికో కృత‌జ్ఞ‌త ఓ ధ‌న్య‌వాద!


- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: