మార్నింగ్ రాగా : ఇది తొలి రాత్రి తరగని రాత్రి తొలి వందనం!

RATNA KISHORE
జీవితాల‌ను సంస్క‌ర‌ణ వాదానికి ద‌గ్గ‌ర‌గా తీసుకుని వెళ్లే ప్ర‌య‌త్నం ఒక విశేష‌ణం కావాలి..దానిని ఏమ‌నాలి ప్ర‌య‌త్న విశేష‌ణం అనాలి..భాష‌లో ఎలా అయితే క్రియా విశేష‌ణం, ధాతు విశేష‌ణం వెతుకుతామో! రాత్రిని ర‌ద్దు చేసి రాతి స్వ‌రాల చెంత దేహాల అర్ప‌ణ కూడా ఎందుక‌నో విశేష‌ణ సంబంధం అయితే మేలు..దేహార్ప‌ణ వ‌దులుకున్న జీవితం వ‌ద్ద‌నుకున్న కాలం వ‌ద్ద‌నుకున్న దుఃఖం ఈ విధంగా ఎన్నింటినో నేర్పుతుంది.మ‌నం వ‌ద్ద‌నుకున్న‌వ‌న్నీ వెన్నంటి నడిచి నేల విడిచి సాము చేయ‌మంటాయేంటో! వ‌ద్ద‌నుకున్న కాలం అంటే ద్వేష సంబంధం అయిన కాలం అని అర్థం.. కావాల‌నుకున్న స‌మ‌యం అంటే ప్రేమ పూర్వ‌క అనున‌య ధోర‌ణి అని అర్థం.

అర్థం చెడితే జీవితం చెడుతుందా? లేదా జీవితం చెడిపోయాక అర్థం అవ‌గతం అయి విశేష సంబంధ చ‌ర్య‌ల‌ను స‌వివ‌రంగా వివ‌రించి వెళ్తుందా? వాక్యార్థం చివ‌ర ప్ర‌శ్నార్థ‌కం..జీవితం చివ‌ర ఓ విరామ చిహ్నం  ఉంచితే మేలు..ఎవ‌రికి వారు ప్రాభ‌వ రీతికి తూగేందుకు వీలుగా రాత్రిని నిర్మిస్తే చాలు..అప్పుడు దేహ సాహ‌చ‌ర్యం నిర్వ‌చితం అయి ఉంటుంది.అనిర్వ‌చ‌నీయం కూడా అయి ఉంటుంది.న‌గ్న‌దేహాల కూడిక‌ల్లో రాత్రి ధాత్రి అన్నీ అన్నీ స‌మ‌న్వ‌య సిద్ధికి దగ్గ‌ర‌గా ఉంటాయి.స‌మాన‌త్వ సిద్ధికి పోలి ఉంటాయి.స‌మాన‌త్వం సాధిస్తే స‌మానార్థం తెలిసి వ‌స్తే జీవితం తుల్యం అవుతుంది.స‌మ‌తుల్యం అవుతుంది.అటువంటి సంక‌లిత రాత్రికి  తొలి రాత్రికి ఈ ఉద‌యాన వంద‌నం చెప్పండి..మీ జీవితాల్లో అలాంటి స‌మానార్థ‌క ఛాయ‌లు ఉంటే మొక్కండి ఆ కాలానికి!క్ష‌ణ సంబంధానికి!
 


మ‌నిషిగా బ‌తికే హ‌క్కు కొంద‌రిదే
మ‌నిషిగా చచ్చే హ‌క్కు కొంద‌రికే
చావు బాధ్య‌త కాదు అంతిమం మాత్ర‌మే
బతుకు అంతిమం కాదు హ‌క్కు మాత్ర‌మే



రాత్రి క‌రిగి ఉద‌యం అయింది..బ్ల‌ఫ్ ఇన్ ద సెన్స్ అని రాశానోసారి! మార్నింగ్ రాగా రూపంలో! త‌ర్క సంబంధ‌మో,త‌త్వ సంబంధ‌మో!వెతికేను మ‌నిషి రీతిని!నిన్నటి రాత్రి తొలిరాత్రి..ఏడాదికో తొలిరాత్రి..ఆరంభం ఎలా ఉంది..న‌గ్న‌దేహాల కూడిక‌ల్లో జీవితం ఎలా ఉంది అనే వెతుకులాట‌కు అవ‌ధి లేని రాత్రి..చీక‌టి క‌ళ్లుగ‌ప్పి జీవించ‌డంలోనే లోకం గెలుపు ఉంది అని చెప్పిన రాత్రి..


రాత్రి క‌రిగిన ప‌రిమ‌ళం..రాత్రి క‌డిగిన దేహం.. స్వేద బిందువుల  చెంత త‌డిసిన పాదం..ఇవ‌న్నీ ఏమ‌యి ఉంటాయి.మ‌నుషుల్లో లేనిది..మ‌నుషులు త‌మ‌కు చెందినిది అని అనుకున్న‌ది ఎక్క‌డ‌యినా ఉందా? మ‌నిషికి అన్నీ ఉన్నాయి..మేథ‌స్సు నుంచి మ‌న‌స్సు వ‌ర‌కూ..సూక్ష్మ క‌ణం నుంచి విశ్వ వీక్ష‌ణం వ‌ర‌కూ..ప‌ర‌వ‌శ‌త్వం నుంచి ప‌శుత‌త్వం వ‌ర‌కూ..ఇంకేం కావాలి.. కానీ మ‌నుషుల‌కు నిజాన్ని అంగీక‌రించే విచ‌క్ష‌ణ లేదు.అంగీకార యోగ్యం కానివి ఏవో తెలిసినా ఒప్పుకునే విజ్ఞ‌త లేదు. క‌నుక జీవితాన్ని రాత్రికి అప్ప‌గించి సుఖమ‌య‌మ‌యిన కాలాన్ని తొలి రాత్రి కింద ప‌రిగ‌ణించి ఇప్ప‌టి దుఃఖాల‌ను స్వేద బిందు నాదాల్లో క‌లిపి ప్ర‌యాణించ‌డం ఓ గొప్ప క‌ళ. అవునో కాదో అటువంటి క‌ళాత్మ‌కం అయిన జీవితం ద‌గ్గ‌ర మ‌నిషి పొందే ఓట‌మే రాత్రి మిగిల్చిన విషాదం..క‌లిసి జీవించే శ‌క్తుల‌న్నీ క‌లిసే ఉంటున్నాయా అన్న ప్ర‌శ్న‌కు ఆధారం వెతుకుతూ పోతే స‌మాధానం ఒక పెద్ద సందిగ్ధం.ముగిస్తున్నానొక మార్నింగ్ రాగా...




- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: