ట్రోలింగ్ పాయింట్ : జనవరి 1 వద్దు ఉగాది ముద్దు? దేవుడా ఈ పిల్ల !

RATNA KISHORE
తాగండి తూలండి అని ఏ పండుగ అయినా చెబుతుందా కానీ మ‌నం మాత్రం ఇంగ్లీషు క‌ల్చ‌ర్ నుంచి తీసుకున్న‌వి ఈ రెండే అన్న విధంగా త‌యారౌతున్నాం. అస‌లు అర్ధ‌రాత్రి చ‌ర్చిలో ప్రార్థ‌న చేసి కేక్ క‌ట్ చేసి సంతోషంగా గ‌డిపి,నాలుగు మంచి మాట‌లు విని,పాట‌లు పాడుకుని ఇంటికి చేరుకునే పండుగ ఇది.. ఇదంతా పాశ్చాత్యుల‌కు మ‌న దేశంలో ఉన్న క్రైస్త‌వుల‌కు చెందిన పండుగ. కానీ ఆ పండుగ రాను రాను మార్కెట్  సంస్కృతిని పులుముకుని ఎన్న‌డూ లేనంత క్రేజ్ తెచ్చుకుంటోంది. అస‌లు కొత్త ఇంగ్లీషు ఏడాది వ‌చ్చే ముందు (డిసెంబ‌ర్ 31 రాత్రి) తాగ‌క పోయినా చిందులేయ‌క‌పోయినా అదొక నేరం మ‌నోళ్ల‌కు అన్న విధంగా సంస్కృతి ఉంది.. మ‌న సంస్కృతి వ‌ద్ద‌నుకుని ఇత‌రుల సంస్కృతికి ప్రాధాన్యం ఇచ్చి, తెలుగు వారి మూలాల‌ను వ‌దిలి ఎక్క‌డో ఉన్న ప‌ర‌దేశ‌పు  పాట‌లు ఆట‌లు అందుకోవ‌డం ఎంత వ‌ర‌కూ స‌బ‌బు అన్న‌ది ఇవాళ్టి చ‌ర్చ.

ఈ త‌రుణంలో ఈ నేప‌థ్యంలో
అర్ధ‌రాత్రి నృత్యాలు అర్ధరాత్రి తాగి,తాగి ఇంటికి చేరుకోవ‌డాలు..వీటిని దాటి ఇంగ్లీషోడి పండుగ‌కు ఏమ‌యినా ప్ర‌త్యేక‌త ఉందా? అని అడుగుతున్నారు వైదికులు. మ‌న‌ది కాని సంస్కృతిని మ‌నం నెత్తిన పెట్టుకుని, జీవితాల‌ను పాడుచేసుకుంటున్నామ‌ని అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నారు. అందుకే జ‌న‌వ‌రి 1 వ‌ద్ద‌ని, ఉగాది పండుగే ముద్దు అని అంటున్నారు. ఆయురారోగ్యాలు ఇచ్చే పండుగ‌లు వ‌దిలి ఒళ్లు గుల్ల చేసి జేబు ఖాళీ చేసే ఇంగ్లీషోడి పండుగ‌లు ఎందుకు చేసుకోవ‌డం అని వారంతా ప్ర‌శ్నిస్తున్నారు. హాయిగా తీయ‌గా సాగే వ‌సంత గానం విని పుల‌కించి పోవాలి కానీ ప‌బ్బుల్లో డ్యాన్సులేంటి?  క్ల‌బ్బుల్లే తాగుడేంటి?

మ‌న సంస్కృతిని వ‌దులుకుంటున్నారు ? 
లేత మామిడి తోర‌ణాలు, కోయిల కూజితాలు, ప్ర‌కృతి పుల‌కింత‌లు ఇవ‌న్నీ చూసి మైమ‌రిచి పోయే సంద‌ర్భంలో ఉగాది వ‌స్తుంది.  తెలుగు నామ సంవ‌త్సరం అన్న‌ది అక్క‌డి నుంచి ఆరంభం అవుతుంది. ఆ రోజు నుంచి మ‌న జీవితాల్లో రుతువుల ప్ర‌భావం మారుతుంది. ప్రకృతి సోయ‌గాలతో ప‌ల్లె పుల‌కిస్తోంది. అంతేకాదు రుగ్మ‌త‌ల‌ను నివారించే ఉగాది ప‌చ్చ‌డి, రేప‌టి వేళ మ‌న న‌డ‌వ‌డిని తెలిపే పంచాంగ శ్ర‌వ‌ణం ఇవ‌న్నీ తెలుగు వారికే ప్ర‌త్యేకం. అంత గొప్ప  పండుగ వ‌దిలి ఇంగ్లీషు పండుగ పేరిట హ్యాపీ న్యూ ఇయ‌ర్ అంటూ మ‌న సంస్కృతిని ఎలా వ‌దులుకుంటున్నారు మీరు అని అంటున్నారు సంప్ర‌దాయ వాదులు.

క‌న్న‌వాళ్ల‌కు క్షోభ‌?
కొత్త ఏడాది అంటే మ‌న‌కు జ‌న‌వ‌రి ఒక‌టి కాదు భార‌తీయ సంప్ర‌దాయం అనుస‌రిస్తే తెలుగు వారి పండుగ‌లు ఆచారం అనుస‌రిస్తే ఉగాదే కొత్త ఏడాది.. అందుకు త‌గ్గ రుతు వ‌ర్ణ‌న ఉంది. శాస్త్ర‌వ‌ర్ణ‌న కూడా ఉంది. కానీ మ‌న వాళ్ల‌కు ప‌ర‌భాష మోజు.. ప‌ర సంస్కృతి మోజు.. క‌నుక వీళ్లంతా జ‌న‌వ‌రి ఒక‌టిన రోడ్ల‌పై ఒళ్లు మ‌రిచి తిరుగుతుంటారు. బాధ్య‌త మ‌రిచి ప్ర‌వ‌ర్తిస్తుంటారు. క‌న్న‌వాళ్ల‌కు క్షోభ‌ను మిగులుస్తుంటారు. అదే మ‌న పండుగ రోజు చూడండి ఇన్ని వికృతాలు ఉంటాయా? ఇంత గా తాగ‌డం తూగ‌డం అన్న‌ది కుర్ర‌కారుకు ఉంటుందా.. అదుపు త‌ప్పి వాహ‌నాలు న‌డిపి ప్ర‌మాదాల‌కు కార‌ణం అయిన సంద‌ర్భాలు ఏమ‌యినా ఉంటాయా ఒక్క‌సారి అయినా ఆలోచించండి...అని చెబుతున్నారు స‌నాత‌న ధ‌ర్మ ప్రచార క‌ర్త‌లు.


మ‌న‌ది కాని సంస్కృతి

ఇంగ్లీషు సంస్కృతికి చెందిన పండుగ‌గా ఆంగ్ల సంవ‌త్స‌ర ఆరంభాన్ని చూస్తూ వేడుక‌లు చేస్తూ ఉండ‌డం మ‌న‌కు త‌ప్పు అని అంటున్నారు భార‌తీయత ను న‌మ్ముకుని ప్ర‌చారం చేసే వైదికులు. క్యాలెండ‌ర్ అన్న‌దే మ‌న‌ది కాదు. ఎక్క‌డో పుట్టిన క్యాలెండ‌ర్ ఇక్క‌డ‌కి వ‌చ్చి చేరింది. ఎక్క‌డో పుట్టిన క‌ల్చ‌ర్ ఇక్క‌డ ఉంటుంది. ఇందులో త‌ప్పేం ఉంది..అని అడుగుతున్నారుఇంకొంద‌రు. సంస్కృతి ఏద‌యినా కూడా మ‌నం గౌర‌వించ‌డంలో త‌ప్పు లేదు కానీ మ‌న‌ది కాని సంస్కృతిని మ‌నం నెత్తిన పెట్టుకోవ‌డం అన్న‌ది త‌ప్పు అని చెబుతున్నారు భార‌తీయ‌త‌ను ప్ర‌చారం చేసే వైదికులు. ఈ వాద‌న కొద్ది రోజులుగా న‌డుస్తోంది. ట్రోల్ అవుతుంది కూడా! జ‌న‌వ‌రి ఒక‌టి అన్న‌ది డేట్ లో మార్పు త‌ప్ప ప్ర‌కృతిలో మార్పు కాద‌ని, క‌నుక రుతువుల గ‌మ‌నం అనుసారం వ‌సంత రుతు ఆగ‌మ‌నాన్నే మ‌నం ప్రేమించి ఉగాది వేళ‌ల్ని అత్యంత వైభ‌వంగా జ‌రుపుకోవాల‌ని అంటోంది వైదిక వ‌ర్గం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: