హ్యాపీ న్యూ ఇయ‌ర్ 2022 : ఇష్ట‌మ‌యిన ఖాళీత‌నం ఆ పేజీకే సొంతం డైరీ రాయొద్దు బ్ర‌ద‌ర్!

RATNA KISHORE
ఇష్ట‌మ‌యిన ఖాళీత‌నం అన్న‌ది
చాలా పెద్ద ప‌ని!
రాయ‌కుండా ఉన్నంత
రాసి ఎవ్వ‌రితోనూ చ‌ర్చించ‌లేనంత
ప్ర‌స్తావ‌న‌కు దూరంగా ఉంచినంత
ఒక ఊహంత ఒక చెట్టంత
ఇంకా చెప్ప‌నా నాలో నాఅంత మీలో మీరెంత‌?
ఈ రాయ‌ని రాత చెబుతోంది ఇవాళ?
క‌నుక ఖాళీత‌నం ఇష్ట‌మ‌యిన ప‌నికి సంకేతిక


రాత్రంతా ఎదురు చూసిన  ఒక ప్ర‌పంచం.. ఒక దేహం.. రాత్రి కాలాల‌ను నిషిద్ధం చేసిన ఆలోచ‌న‌.. వాటికి త‌గ్గ ప్ర‌తిపాద‌న.. ఎక్క‌డో మ‌నం రాయ‌కుండా ఉండాలి.. ఎందుకంటే రాసేదంతా మంచికి స‌హ‌కారి కాదు.. కానీ అవుతుంద‌న్న ఓ ఊహ మాత్రం కాస్త ఊర‌ట! ఎందుకంటే రాస్తున్నదంతా పాటింపులో లేదు క‌నుక మంచి అనే ప‌దానికి అది చేరువ కాదు. దూరంగా ఉంటూనే మంచి చెడుల గుణ నిష్పత్తిలో నిష్ఫ‌ల‌త‌ను అంచ‌నా వేయాలి. ఆ ప‌ని ఎవ్వ‌రు చేసినా వారు డైరీ రాయ‌క్క‌ర్లేదు. కాలాన్ని కొల‌వ‌క్క‌ర్లేదు. దైవానికి మొక్క‌నూ అక్క‌ర్లేదు.. సంబంధిత ప‌నులేవీ చేయ‌కుండానే కాలం ద‌గ్గ‌ర ఓ విజేతగా ఉండ‌వ‌చ్చు.. అందుకు నిబ‌ద్ధ‌త ఒక‌టి ప్రామాణిక సూత్రం అయి ఉంటుంది. ప్రామాణిక సూత్ర‌త అన్న‌ది ఒక ర‌చ‌న‌కు అవ‌ధి  అవుతుంది. పాటింపు ల‌క్ష‌ణం.. ఆలోచ‌న ఉత్తేజం.. చుట్టూ ఉన్న ప‌రిస‌రం ప్రేర‌ణ గుణ‌కం.. ఈ పాటి ఆలోచించ‌కుండా రాస్తున్నారేంట్రా?


డైరీలూ,పేజీలూ ఖాళీగానే ఉన్నాయి. ఉండాలి కూడా! డైరీలో మ‌నుషులు లోకం చివ‌రి మ‌నుషులు అయి ఉండాలి.. డైరీలో జ్ఞాప‌కాలు ఊరి చివ‌ర జ్ఞాప‌కాలు.. డైరీలో ఉద‌యాలు అస్త‌మయాలు మ‌న‌ల్ని వేధించే కాలాలు అయి ఉండ‌కూడ‌దు. ఇదొక్క‌టే నా అవ‌ధి. ఎందుకు రాయాలి ద‌గ్గ‌ర నుంచి ఎక్క‌డ ఆగాలి వ‌ర‌కూ డైరీ జీవితాన్ని ప్ర‌శ్నిస్తూ పోతోంది. ఎక్క‌డ ఆగాలి అన్న‌ది ఒక సందిగ్ధం కాదు కానీ స‌మాధాన రీతికి తూగ‌ద‌గ్గ ప‌రిణితి.. ఎవ‌రికి స‌మాధానం చెప్పాలి.. ఎదురుగా ఉన్న కాలానికి లేదు లోప‌ల ఉన్న కాలానికి.. ఈ రెండింటి మ‌ధ్య ఉన్న సంవాద ధోర‌ణికి.. క‌నుక రాయ‌కుండా ఉండ‌డ‌మే బెట‌ర్!

 
ఏం రాయాలి అన్న ప‌రిణితి ఎవ‌రికి వారు పొంది ఉండాలి.. పెంచుకుని ఉండాలి..లేదంటే రాస్తున్న‌వి అబ‌ద్ధాలు అయి ఉంటాయి లేదా అబ‌ద్ధాల రూపాన ఉన్న నిజాలు కూడా కావొచ్చు. ఎక్క‌డ ఆగాలి అన్న‌ది ఓ పెద్ద ఆలోచ‌నాత్మ‌కం. నా వ‌ర‌కూ అవధి నిర్ణ‌యం. రోజులో చేసే త‌ప్పులు డైరీలు ఒప్పుల‌యి పోవు క‌దా! రోజంతా చేసే మంచి మ‌రుస‌టి రోజుకు మ‌రిచి పోవ‌డం సాధ్యం కాదు క‌దా! మంచి చెడుల‌న్న‌వి అక్షరాల‌కు అంటించి వెళ్ల‌డంలో అర్థం లేదు. అవి జీవన గ‌తికి ప్రామాణిక నిర్దేశ‌కాలు.. లోప‌ల నిజాయితీ ఉంటే బ‌య‌ట వెల్ల‌డి లోకం ఆమోదానికి పొంది ఉంది. కాదు ఉంటుంది అని రాయాలి. క‌నుక డైరీలో పేజీలు ఖాళీగానే ఉండాలి.. ఇష్ట‌మ‌యిన ఖాళీల‌ను కాలం పూరిస్తుంది.. స‌మ‌యం స‌మాధానం చెప్పి ఇంకొన్ని ప్ర‌శ్న‌ల‌కు ప్రామాణికం అయి ఉంటుంది.


- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: