హ్యాపీ క్రిస్మ‌స్ : ప‌రిశుద్ధాత్మ‌ను పొందాలంటే?

RATNA KISHORE
ఆత్మ నిశ్చ‌లం నిర్మ‌లం అయి ఉంటుంది. భ‌గ‌వంతుడి ఎదుట ఆత్మ జ్ఞానం ఒక‌టి వెలుగులీనుతూనే ఉంటుంది. వెలుగును ప్రేమించ‌డంలో ఉన్న బాధ్య‌త‌ను క్రిస్మ‌స్ గుర్తు చేస్తుంది. ఏడాదంతా వెలుగుల తీరంలో గ‌డిపేందుకు ఓ గొప్ప ప్రార్థ‌న అవ‌కాశం ఇస్తుంది. ప్రేమ,క్ష‌మ అన్న‌వి వెలుగుల తీరంలో ఎలా ఉంటాయి.. ఎందుక‌ని అవి ఇత‌రుల మ‌ధ్య ఉన్న విభేదాల‌ను స‌మ‌సి పోయేలా చేస్తాయి..? ఇవ‌న్నీ ఎవ‌రికి వారు తెలుసుకోవాలి. ప‌రిశుద్ధాత్మ‌ను ప్రేమించ‌డం దేవుడి ద‌గ్గ‌ర మాత్ర‌మే సాధ్యం.. మ‌నుషులు త‌మ లోప‌లి ప్రపంచాన్ని శుభ్ర ప‌రచ‌డం చేత‌గాక స్వార్థ భావ‌న‌ల‌తో కాలం వెచ్చిస్తారు.


మంచు సోన‌ల న‌డుమ వ‌చ్చే ఈ క్రిస్మ‌స్ వేడుక‌లు ఇదివ‌ర‌క‌టి క‌న్నా బాగుండాలి. ఇదివ‌ర‌కటి క‌న్నా ఉన్నతంగా ఉండాలి. అభాగ్యులకు ఇచ్చే గుణం చ‌ర్చి నేర్పుతుంది. ప్రార్థ‌న నేర్పుతుంది. పంచే గుణంలో ఆద‌ర‌ణ ఉంటుంది. తల్లిదండ్రులు పంచే గుణం ప్రేమ.. త్యాగం కూడా! త్యాగం ఉన్న‌తం అయితే జీవితం ఇంకాస్త వృద్ధిలో ఉంటుంది అని చ‌దివేను. త‌ల్లిదండ్రుల త్యాగం, వీరుడి త్యాగం ఇవ‌న్నీ దేవుడికి ఇష్ట‌మ‌యిన‌వి అని బైబిల్ చెబుతోంది. దేశం కోసం త్యాగం దేవుడికి ఇష్ట‌మ‌యిన కార్యం అని కూడా చెబుతుంది. ప‌రిశుద్ధాత్మ‌లు అంటే ఇవి. ఇవి మ‌లినం అంట‌నీయవు..అంటించుకోవు..ఇత‌రుల చెడు ప్ర‌భావం వీరిపై ఉండ‌దు గాక ఉండ‌దు.


కోరిక‌లు తీర్చే యంత్రాలేవీ మ‌నుషుల్లో ఉండ‌వు. ఎవ‌రి ప‌ని వారు నిరంత‌రం చేయ‌డ‌మే యాంత్రిక జీవితంలో విధి. చుట్టూ ఉన్న వారి నుంచి కాస్తంత క‌రుణ కోరుకోవ‌డంలో త‌ప్పు లేదు. క్ష‌మ‌ను కోరుకోవ‌డం కూడాత‌ప్పు కాదు. చ‌లికి వ‌ణికి పోతున్న జీవుల‌కు  అందించే కంబ‌లి, ఆక‌లితో అల్లాడుతున్న వారికి అందించే అన్నం ఇవ‌న్నీ పెద్ద పెద్ద పుణ్య కార్యాలే.. పుణ్యం అంటే ఇత‌రుల‌కు ద‌క్క‌నిది అని! పాపం అంటే ఎవ‌రికి వారు అనుభ‌వించేది అని అర్థం. పాప ప‌రిహారం చేసుకోవ‌డంలో మ‌నిషి వెతికే ప్ర‌తీ దారీ భ‌గ‌వంతుడి నిర్దేశం అయి ఉంటుంది. దారి నిర్మాణంలో భ‌గ‌వంతుడి సాయం నిష్క‌ల్మ‌ష హృద‌యాల‌కే ఉంటుంది. అంద‌రికీ దైవ స‌హ‌కారం ఉంటుందా? ఎందుకు ఉండాలి.. మ‌నిషి  త‌న ధ‌ర్మం పాటిస్తూ ఇత‌రుల కోసం జీవించేందుకు ప్రాధాన్యం ఇస్తేనే భ‌గ‌వంతుడి సాయం ఉంటుంది. ఆ విధంగా ప‌రిశుద్ధాత్మ ప్రేమ మ‌రో కానుక‌గా జ‌త అయి ఉంటుంది. అందుకు ఎవ‌రికి వారు  చేసే ప్ర‌య‌త్నమే ప్రార్థ‌న.. ప్రేమ‌ను పొంద‌డ‌మే ప్రార్థ‌న. దైవం ప్రేమను పొంద‌డ‌మే ప్రార్థ‌న.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: