హ్యాపీ క్రిస్మ‌స్ : నీడ్ ఎ హ‌గ్

RATNA KISHORE
పెద్ద‌లంతా బిడ్డల‌కు అండ‌గా ఉండాలి. ఆత్మీయానుభవం ఒక‌టి అందించాలి.. ఇది క‌దా క్రిస్మస్ నుంచి కోరుకోవాలి. బిడ్డ‌లు చ‌దువుల‌కు దూరం కావొచ్చు కానీ సంస్కారం మాత్రం ఒక‌టి వెన్నంటే ఉండాలి. వీధిలో న‌డ‌యాడే బాల్యానికి ఇంట్లో న‌డ‌యాడే బాల్యానికీ అండ‌గా ఈ క్రిస్మ‌స్ ఉండాలి.. దేహం ఆత్మ ఈ రెండూ క‌ల్లోలితాల‌కు దూరంగా ఉండాలి.. ఆ విధంగా ఉంచే శ‌క్తి ఈ క్రిస్మ‌స్ దే కావాలి. ఆత్మీయానుభవం అన్న ప‌దం చాలా గొప్ప‌ది.. పిల్ల‌ల‌కు పెద్ద‌ల కౌగిలి దీవెన ప్రేమ అన్న‌వి ఇక్క‌డి నుంచే వ‌స్తాయి.. ఆకాశం నుంచి అవి దిగిరావు.. క‌నుక దిగి రానివి వ‌ద్దు కానీ చెంతనే ఉండే ఈ వృద్ధ తార‌లు కొన్ని పిల్ల‌ల‌కు చేరువుగా ఉంటే చాలు..
క్రిస్మ‌స్ అంటే వెలుగుల పండుగ. కానుక‌ల పండుగ.. మ‌నిషి త‌న నుంచి తాను తెలుసుకోద‌గ్గ‌ది నేర్చుకోద‌గ్గ‌ది మ‌రోసారి స్మ‌రించుకోద‌గ్గ పండుగ. పండుగలు ఏవ‌యినా ప‌రివ‌ర్త‌న‌కు కార‌ణం అయి ఉండాలి. మ‌నుషుల‌కు పాపం పుణ్యం అనే భారాలు రెండు వెన్నాడుతాయి. అవును ఇవి భావాలు కాదు భారాలే! మ‌నుషుల‌కు క‌న్నీళ్లు ఇచ్చి కొన్నిసార్లు అడ్డుకుంటాడు కొన్నింటిని భ‌గ‌వంతుడు.. ఆ క‌న్నీటి తెర‌ల మ‌ధ్య మ‌నుషులు ఎలా ఉండాలి ఎలా ఉంటారు అన్న‌ది అర్థం చేసుకోవాలి. ఈ క్రిస్మ‌స్ పండుగ మ‌నుషుల‌కు తోటి వారిని అర్థం చేసుకునేంత గొప్ప మ‌న‌సు ఒక‌టి ప్ర‌సాదిస్తే చాలు. తోటి వారికి అండ‌గా ఉండేంత శ‌క్తి ప్ర‌సాదిస్తే మేలు. తీవ్ర తుఫానుల ధాటికి వ‌ర‌ద‌ల ఉద్ధృతికి విల‌విల‌లాడుతున్న బాధితుల‌కు అండ‌గా ఉంటే ఇంకా మేలు.
క్రిస్మ‌స్ అంటే కానుక‌లు కదా! మ‌న మాన‌వ సంబంధాలు ఎలా ఉన్నాయో తెలిపే ఘ‌ట‌న ఒక‌టి ఇవాళ చ‌దివేను.. అమెరికాలో ఆరేళ్ల పాప నీకు క్రిస్మ‌స్ కానుక ఏం కావాలి అని త‌ల్లి అడిగితే నాన్న‌మ్మ హ‌గ్ అని రాసి ఇచ్చింది. అది చ‌దివి ఆ త‌ల్లి నిశ్చేష్టురాల‌యింది. ఆధునిక కాలంలో బిడ్డ‌ల‌కు త‌ల్లుల‌కూ మ‌రియు వారి పూర్వ కాల పెద్ద‌ల‌కు అంద‌రికీ దూరం ఒక‌టి శాపం అవుతోంది. పూర్వ కాల పెద్ద‌ల దీవెన‌లు పొంద‌డ‌మే పెద్ద కానుక అని అదే ఈ క్రిస్మ‌స్ ఇచ్చే గొప్ప జ్ఞాప‌కం అని ఆ బిడ్డ‌కు ఆ త‌ల్లికి ఆ నాన్న‌మ్మ‌కు చెప్పింది క్రిస్మ‌స్ అని చదివేను. అవును పూర్వ కాల పెద్ద‌లు మ‌న ముంద‌రి పెద్ద‌లు మ‌న‌కు స్ప‌ర్శ‌ను అందించ‌కుండా, ఆత్మీయ‌త‌ను అందించ‌కుండా కాలం ఏమ‌యినా శాపం విధిస్తుందా?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: