ఆన్‌లైన్‌ షాపింగ్‌లో పూజా పత్రి కొనుగోళ్లు!

N.Hari
అసలే ఇప్పుడంతా ఆన్‌లైన్‌ యుగం నడుస్తోంది. దీనికి తోడు కరోనా కాలంలో బయట మార్కెట్‌కు వెళ్లి ఏదైనా కొనాలంటేనే జనాలు జంకుతున్నారు. ఇక పండుగల వేళ పూజా సామగ్రి కొనుగోలు కోసం బయట మార్కెట్‌కు తప్పక వెళ్లాల్సిన పరిస్థితి. వినాయక చవితి పండుగ వచ్చిందంటే.. బహిరంగ మార్కెట్‌లో హడావుడి, జన సమ్మర్ధత ఎక్కువగానే ఉంటుంది. దీంతో చాలా మంది ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. ఇందులో భాగంగా చాలామంది ఆన్‌లైన్‌ షాపింగ్‌కు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం వినాయకుడిని పూజించడానికి కావాల్సిన పూజా సామాగ్రిని ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేస్తున్నారు.
బొజ్జ గణపయ్యను పూజించడానికి 21 రకాల ఆకులు వినియోగించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో వాటి కోసం పలు మార్కెట్లు తిరగాల్సి ఉంటుంది. పైగా హైదరాబాద్‌ వంటి నగరాల్లో అన్ని రకాల పత్రి దొరకడం చాలా కష్టమే అని చెప్పాలి. అయితే ఆన్‌లైన్‌లో పూజా పత్రిని విక్రయిస్తున్నారని తెలియడంతో చాలా మంది.. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఆన్‌లైన్‌ వేదికగా మట్టి వినాయక విగ్రహాలతోపాటు పత్రిని కూడా విక్రయిస్తున్నారు. దీంతో వినాయక పండుగ వేళ ఆన్‌లైన్‌ షాపింగ్‌కు ఆదరణ పెరిగింది.
పర్యావరణాన్ని పరిరక్షించాలన్న అవగాహన ప్రజల్లోనూ రోజురోజుకు పెరుగుతోంది. దీంతో మట్టి విగ్రహాలను కొనుగోలు చేసే వారి సంఖ్య అధికమవుతోంది. వివిధ సైజుల్లో మట్టి గణేషుడి విగ్రహాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. 21 రకాల పత్రితో పాటు పూజ సామగ్రి, వినాయకుడి విగ్రహం కలిపి కూడా ఆన్‌లైన్ ద్వారా అమ్మకాలు సాగుతున్నాయి. అయితే పర్యావరణంపై ప్రజల్లో పెరిగిన అవగాహనను కొందరు క్యాష్ చేసుకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
మొత్తానికి పండుగ వేళ ఎకో ఉత్పత్తులకు డిమాండ్  అయితే పెరుగుతోంది. సంప్రదాయబద్ధంగా పండుగ చేసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. వినాయక చవితి కోసం అరుదైన ఎకో ఉత్పత్తులు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉండటంతో.. అటు వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు.  కరోనా భయంతో మార్కెట్‌కు వెళ్లలేని వారు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: