ఒక్క ముద్ద .. తక్కువ తిను ..

నేటి సమాజంలో నేను, నాది, నాకు అనే నా గుడింతం తప్ప మనది, మనకోసం, మన వాళ్ళు అనేవి తక్కువైపోతున్న తరుణం. ఒకప్పుడు మన చుట్టుపక్కల ఏదైనా చిన్న సమస్య ఎవరికైనా వస్తే, పదిమంది అక్కడ చేరి, సమస్య తీర్చేందుకు కృషి చేసేవారు. కానీ ఇప్పుడు అలాంటిది ఏమైనా జరిగితే వారిని మొబైల్స్ లో బందించి సామజిక మాధ్యమాలలో పెడుతున్నాం తప్ప, చేయి ఇచ్చి సాయం చేయడం చాలా తక్కువ చూస్తున్నాం.
పాతకాలంలో పూటకూళ్ళమ్మ అనేవాళ్ళు ఉండేవాళ్ళు, వీళ్ళ పనేమిటి అంటే, అప్పట్లో ఇంతగా రవాణా వ్యవస్థ లేదు కాబట్టి ఎక్కడకు ప్రయాణం పెట్టుకున్నా కనీసం రోజులు పట్టేది. అలాంటప్పుడు భోజనం తదితర ఏర్పాట్లు చాలా ఇబ్బందిగా ఉండేది. ఎక్కడ ఆయా ఏర్పాట్లు ఉంటాయో తెలియదు, ఎప్పుడు వరకు ఉంటాయో తెలియని స్థితిలో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడేవారు. వారి వెంట ఆహారం తెచుకున్నప్పటికీ అది ఎక్కువ రోజులకు సరిపోని స్థితి. అందుకే వీళ్లు పూటకూళ్ళ వారిపై ఆధారపడేవారు. వీళ్లు ఎప్పుడు ఆకలి అని ఎవరు ఎంతమంది వచ్చినా కూడా అందరికి ఆహారం ఏర్పాటు చేసేవారు.
ఒకరికోసం అందరు, అందరి కోసం ఒక్కరు అనే విధంగా నాటి జీవన విధానం ఉండేది. ఇప్పుడు ఎవరికి వారే అన్నట్టే ఉంటున్నారు. ఈ ప్రపంచంలో లేనిది ఎక్కడి నుండి తేలేము, అలాగే ఇక్కడ ఉన్నవి సద్వినియోగం చేసుకోగలం, ఇది మన వనరులు. ప్రపంచంలో ఎంతో జనాభా ఉంది. అందులో ఇంకా రోజు ఆహారం దొరకక మృతి చెందుతున్న వారూ ఉన్నారు అంటే మన జీవన విధానంలో ఏయే లోపాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇందరు ఉండి ఒకరు కనీసం ఆహారం కూడా దొరకక చనిపోతే అది ఆ వ్యక్తి తప్పవుతుందా లేక ఇంత మంది ఉండి తాను చనిపోవడం మన తప్పా..!
అంటే తెలిసి తెలిసి రోజు  మనం ఎందరి చావుకొ పరోక్షంగా కారణం అవుతూనే ఉన్నాం, అయినా దర్జాగా బ్రతికేస్తున్నాం. అలా కాకుండా ఆ ప్రాణాన్ని నిలబెట్టుకుంటే, కలిగే ఆత్మతృప్తే వేరు, కాదంటారా. అప్పుడే మనిషి జన్మ ఎత్తి ప్రయోజనం. లేకుంటే మరెందుకు ఈ జన్మ. కావాలి అంటే ప్రతీ పూట ఒక్క ముద్ద తక్కువగా తిను, అది లేనివాళ్ళకు పంచు. నీ ఇంట్లో ఎందరు ఉన్నారు, రోజు లేదా నెలకు ఎన్ని తిండి గింజలు మిగులుతాయి, అవి ఆహారం లేక తపించిపోతున్న వారితో పంచుకొని మనకి మనం మనుషులమని గుర్తుచేసుకుందాం. అలా కాకుంటే, ఊరికే శరీరాన్ని మనిషి అనడం సమంజసం కాదేమో, అందులో మానవత్వం ఉంటేనే మనిషి అనిపించుకుంటుంది, లేదంటే ఆకారంగా మాత్రమే మిగిలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: