వృత్తులలోకెల్లా గొప్పది... టీచర్ లేకుంటే ఫ్యూచర్ లేదు

Vimalatha
టీచర్ జాబ్ అనగానే ఎంతో ప్రశాంతంగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారి జీవితాల్లో కరోనా అల్లకల్లోలం సృష్టించింది. ఎవరికీ పని తప్పినా ఈ మహమ్మారి సమయంలో టీచర్లకు మాత్రం పని తప్పడం లేదు. ఏదేమైనా సరే వాళ్ళు స్కూళ్లకు లేదా కాలేజీలకు హాజరు కావాల్సిందే. ఒకవైపు కరోనా సోకుతుందేమోననే భయం, మరోవైపు జీతం కష్టాలు. ఈ సమయంలో ఎంతోమంది పాఠశాల, కళాశాలల యాజమాన్యం పిల్లల తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి మరీ ఫీజులు వసూళ్లు చేశారు. ఈ విషయంపై రచ్చరచ్చ అవ్వడం కూడా తెలిసిందే. అయినప్పటికీ వాళ్ళ పంథా వాళ్లదే. సీతయ్య ఎవరి మాటా వినడు అన్నట్టుగా స్కూళ్ల, కాలేజీల యాజమాన్యం వ్యవహరించారు.
అంతవరకూ సరే మరి టీచర్లకు జీతాలు సరిగ్గా చెల్లించారా ? అంటే అదీలేదు. చాలా మంది టీచర్లకు జీవితాలు చెల్లించకుండా వేధించారు. మరికొంత మందికేమో ఎన్ని గంటలు పని చేసినా జీవితం మాత్రం సగమే. మరోవైపు ఆన్లైన్ క్లాసులు. ఇప్పటి వరకూ బ్లాక్ బోర్డుపై పాఠాలను వివరించిన టీచర్లకు డిజిటల్ క్లాసులకు మారడం ఇబ్బందే మరి. పైగా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలి. పిల్లలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా, వాళ్లకు అర్ధమయ్యే విధంగా క్లాసులు నిర్వహించాలి. అయితే క్లాసులోనే పిల్లలకు సరిగ్గా పాఠాలు అర్థం కావు. అలాంటిది ఆన్లైన్ లో ఏం నేర్పిస్తారు అనే విమర్శలూ తప్పలేదు వాళ్లకు.
ఇక ఈ కరోనా సమయంలో కొంతమంది టీచర్లు ఉద్యోగం కూడా పోగొట్టుకున్నారు. ఏది ఏమైనప్పటికీ వాళ్ళు పాఠాలను బోధించడం మాత్రం మానలేదు. జ్ఞానాన్ని అందించడం అనేది అన్ని వృత్తులలోకెల్లా గొప్పది. ఆ వృత్తిని చేపట్టే ఉపాధ్యాయులకు కూడా ఎప్పటికి మంచి గౌరవం లభించాల్సిందే. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న టీచర్స్ అందరికి శుభాకాంక్షలు. టీచర్ లేకపోతే ఫ్యూచర్ లేదన్నది జగమెరిగిన సత్యం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: