వెజ్ బూతులు .. లాక్ డౌన్ కొత్త ట్రెండ్ ..

బూతు బూతు బూతు ... ఇలా అనగానే బీప్ సౌండ్ లేక సెన్సార్ కట్ అని తెలుస్తుంది కదా. అవును ఈ పదాలు వెండి తెరపై ధ్వనించగానే సెన్సార్ తప్పదు మరి. కానీ కొన్నిటికి ఈ మధ్య ఆ బాధ తప్పింది. స్వేచ్ఛగా వాడేస్తున్నారు. కారణం నేటి సమాజంలో పెద్దా చిన్నా అని లేకుండా అందరు నాన్ వెజ్ బూతులు వాడేస్తూ కనిపిస్తున్నారు. అందరికి ఈ తరహా అనుభవాలు ఉండే ఉంటాయి. అలా నడిచి వెళ్తున్నప్పుడు ఎవడో బుడతాడో, పంపు దగ్గర ఆడవాళ్ళో .. ఎక్కడో ఒక చోట కనీసం రోజులో ఒక్కసారైనా ఈ సందర్భం ఉండి తీరుతుంది. బస్టీలుగా పిలవబడుతున్న ప్రాంతాలలో అయితే ఇవి చాలా సహజంగా వినిపిస్తుంటాయి. ఈ పరిస్థితులలో పెరిగిన పిల్లలు వాటిని యధావిధిగా ఉచ్చరించడం సహజం, ఎందుకంటే పిల్లలు పెద్దల సమాజంలో ఏమి చూసినా, లేక విన్నా దానినే అనుకరిస్తూ ఉంటారు. వాటికి అర్ధం ఆ పసివారికి తెలియదు కూడా, అయినా ఏదో ఊత పదం వాడినట్టు వాడేస్తుంటారు.
సహజంగా ఒక ఆరోగ్యవంతమైన సమాజం లాంటి కుటుంబంలో పెరిగితే, అక్కడ నివసించే పెద్దలు సంస్కారంతో నడుచుకునే నియమంతో ప్రవర్తిస్తారు కాబట్టి వారి నోటి నుండి ఈ బూతులు వినపడవు.  అందుకే అక్కడ పిల్లలు కూడా ఆరోగ్యకరమైన బాష మాట్లాడుతుంటారు. ఇక స్నేహాలలో ఇలాంటివి ఏమి అడ్డుకాదు కాబట్టి, అన్ని వర్గాల వారు ఆ లిస్ట్ లో ఉంటారు కాబట్టి కుటుంబంలో సంస్కారం నేర్పినా స్నేహాలతో బూతులు నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. అవి ఏదైనా అనుకోని సందర్భంలో టక్కున బయటకు వచ్చేస్తుంటాయి. అప్పుడు కూడా తమని తాము తమాయించుకున్న వారు విఘ్నులు. అది పెద్దలైనా సరే, పిల్లలైనా సరే.
ఇవన్నీ వారివారి వ్యక్తిగతం అయినప్పటికీ, సమాజంలో కలిసి జీవిస్తున్నప్పుడు కొన్ని కనీస ధర్మాలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక నోటినుండి అనుకోకుండా వచ్చే బూతులను నియంత్రించుకోడానికి ఊత పదాలు పాతకాలంలో వాడేవారు. ఇప్పుడు అది ఎలా మార్చేశారు అంటే, బూతులే ఊతపదాలు అని అనుకుంటున్నారు. రెండు వేరు, ఒక సామాన్య వస్తువును పదేపదే వాడితే అది ఊతపదం అవుతుంది. ఉదాహరణకు బాబూమోహన్ కొన్ని సినిమాలలో చింతకాయ్ అనే పదం వాడేవారు, అది ఊతపదం కిందకే వస్తుంది.  
ఇక కోపం లాంటి సందర్భాలలో నియంత్రించుకోడానికి కూడా ఎప్పుడో కొన్ని చిట్కాలు చెప్పబడ్డాయి. మరో సినీ ఉదాహరణ లోకి వెళ్తే, సీనియర్ నరేష్ నటించిన ఒక చిత్రంలో కోట శ్రీనివాసరావు పెద్ద మోతుబరి. ఆయనకు ఒక కొడుకు. ఆయనకు ఉన్న ఒక్కటే చెడ్డ అలవాటు నోటివెంట ఇష్టానుసారంగా బూతులు వాడేయటం. అదే పిల్లవాడికి వచ్చేసింది. మన హీరో ఉద్యోగ రీత్యా ఆ పిల్లవాడు చదివే పాఠశాలకు ఉపాధ్యాయుడిగా వచ్చాడు. వచ్చిన రోజే పిల్లవాడి నోటి దురుసు చూసి రెండు తగిలిస్తాడు. నిజానికి ఆ పిల్లవాడు ఎవరు అనేది హీరో గారికి తెలియదు. మోతుబరికి కొడుకును కొట్టినందుకు పిచ్చి కోపం వస్తుంది. పంతులు అయిపోయినట్టే అనుకుంటారు అందరు. అప్పుడు మొత్తానికి రాత్రికి హీరో మోతుబరికి దొరికిపోయాడు. అప్పుడు వారి మధ్య సంభాషణలో మోతుబరి నోటి వెంట వినకూడని మాటలు వింటాడు హీరో. అప్పుడు మోతుబరి తో, నేను పొరపాటున పిల్లవాడిని దండించాను, అసలు మిమ్మల్ని దండించాల్సి ఉంది అంటాడు. ఇంకా కోపంతో ఊగిపోయిన మోతుబరికి, ఆయన నోటి దురుసును స్పష్టంగా చెప్తాడు, మీవల్లే మీవాడు కూడా నోటికి అడ్డుఅదుపు లేకుండా ఇష్టం వచ్చిన వన్నీ మాట్లాడుతున్నాడు అంటాడు. తేరుకున్న మోతుబరి, నాకు ఈ లోపం ఎప్పటి నుండో ఉందయ్యా, పరిష్కారం చెప్పు అని హీరోని అడుగుతాడు. అప్పుడు నరేష్, మీ కళ్ల ముందు ఏ వస్తువు కనిపిస్తే దానిని వాడి, బూతును మానేయండి అని సలహా ఇస్తాడు. వెంటనే అది ఆచరణలో పెట్టి, కొడుకును కూడా దిద్దమని వేడుకుంటాడు. లాలించి, ఆడించి వాడికి కూడా చదువు, సంధ్యా అబ్బెట్టు చేస్తాడు హీరో. ఇది ఎప్పటి చిత్రమో అయినప్పటికీ మంచి నీతి ఉంది.
బూతులు మానుకోవాలి అనుకునే వారు కూడా ఇలాంటి చిట్కాలను వాడి, చింతకాయో, బెల్లమో, అప్పడమో, ఆవకాయో, ఉల్లిగడ్డో, నిమ్మకాయో ఏదో ఒకటి ఊత పదం అలవాటు చేసుకొని, మీ పిల్లలకు ఆదర్శంగా ఉండి, వారిని సన్మార్గంలో పయనించే అవకాశం కల్పించండి. అందరు ఇళ్లలోనే ఉంటున్నారు, మీ నోరు మీ తరువాత తరాలకు చాలా నేర్పిస్తుంది. కాకపోతే అది వారిని ఒక మెట్టు ఎక్కిస్తుందా, నాలుగు మెట్లు తోసేస్తుందా అనేది మీపై ఆధారపడి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: